పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ‘క్వీన్’ పేరుతో గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ)
ఈ క్రమంలో ఆమె మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్ మీనన్ తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్’ సిరిస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment