![Jayalalitha Nephew Fires On Director Gautham Menon - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/13/GAUTHAM-MENON.jpg.webp?itok=gcyjZUWH)
సాక్షి, చెన్నై : దర్శకుడు గౌతమ్‌మీనన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈయనపై కోర్టులో కేసు వేస్తానని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడి కుమారుడు దీపక్ అంటున్నారు. జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కోలీవుడ్‌లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు విజయ్ తలైవీ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ అమ్మగా నటించనుంది. అదే విధంగా నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనుంది. కాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ జయలలిత జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా రూపొందించేశారు.
క్వీన్ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్ సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు జయలలిత సోదరుడి కొడుకు దీపక్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జయలలిత గురించి దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. జయలలిత బయోపిక్‌ను గౌతమ్‌మీనన్ రూపొందిస్తే ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో రమ్యకృష్ణ నటించిన క్వీన్ వెబ్ సిరీస్ ప్రసారానికి చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికి దర్శకుడు గౌతమ్‌మీనన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment