వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్‌లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు...
‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’
‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’
‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’
‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్‌లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్‌లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’
‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’
‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’
‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్‌మెంట్‌లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్.
లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’
Comments
Please login to add a commentAdd a comment