సాక్షి, చెన్నై: రాజకీయాల నుంచి తప్పు కుంటున్నట్లు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మేనకోడలు, ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’వ్యవస్థాపక అధ్యక్షురాలు దీప ప్రకటించారు. జయలలిత కన్నుమూసిన తర్వాత జయ అన్న కుమార్తెగా రాజకీయాలకు, ఆస్తికి తానే వారసురాలి నంటూ దీప గతంలో తెరపైకి వచ్చారు. అన్నా డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ను స్థాపించి రాజకీయ అరం గేట్రం చేశారు.
జయ మరణంతో ఖాళీగా మారిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై మధ్యలో విరమించుకున్నారు. పేరవైలో కీలక బాధ్యతలను తన కారు డ్రైవర్‌కు అప్పగించడంతో ఆగ్రహించిన దీప భర్త మాధవన్ ఎంజేడీఎంకే అనే కొత్త పార్టీని స్థాపించారు. దీపను వీడి దూరంగా వేరే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీప పేరవైకి ఆశించి నంతగా ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఈ తరుణంలో దీప మాట్లాడుతూ‘రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భవిష్యత్‌లో మళ్లీ రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment