సాక్షి, చెన్నై : పుట్టినప్పటి నుంచి తాను తన తండ్రిని చూడలేదని, కేవలం మృతదేహం మాత్రమే కాసేపు చూశానని గందపు చెక్కల దొంగ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్ అన్నారు. ఇటీవల ఆమెకు బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో విద్యా సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. తనజీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజం తనను ఓ శత్రువుగానే, ప్రత్యర్ధిగానో చూడలేదన్నారు. మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. (వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి)
తాను నేర్చుకున్న విద్య, ఉపాధ్యాయుల భోదనలు తన ఎదుగుదలకు ఎంతో దోహద పడ్డాయని విద్యారాణి వివరించారు. తాను చిన్నతనం నుంచి తండ్రిని చూడలేదని, ఆయన గురించి పలువురు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు గుర్తుచేశారు. ఒక్క రోజు కూడా తన తండ్రిని చూసే సమయం లభించలేదని, ఆయన మృతదేహం మాత్రమే కాసేపు చూశానని పేర్కొన్నారు. జీవచ్చవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు చెప్పారు. బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment