రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్‌ | i Was Shivered On 1st Day As Defence Minister: Parrikar | Sakshi
Sakshi News home page

రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్‌

Published Mon, Nov 28 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్‌

రక్షణ మంత్రిగా ఆ రోజు వణికిపోయాను: పారికర్‌

పనాజీ: ఆయనలో దేశభక్తి మెండు. ముక్కుసూటిగా పనిచేసే తత్వం అని చెప్తారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అందులో ఓ నిబద్ధత కనబరుస్తారనే పేరు కూడా ఇప్పటికే ఉంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా పనిచేశారు కూడా.. అలాంటి ఆయనకు దేశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం కాస్తంత వణుకుపుట్టిందట.. నేనా.. ఆ బాధ్యతలు నిర్వర్తించగలనా అని అనుమానపడ్డారంట. ఆయన మరెవరో కాదు.. ప్రస్తుతం భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోహర్‌ పారకర్‌.. గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ అధికారంలోకి వచ్చాక రక్షణశాఖ బాధ్యతలు కట్టబెట్టింది.

దీంతో ఆ రోజు తనకు జరిగిన అనుభవాన్ని ఆయన సోమవారం పంచుకున్నారు. విజయ్‌ సంకల్ప్‌ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు తాను వణికిపోయానని, ఆ విషయం తెలియకుండా దాచేందుకు గంబీరంగా ముఖాన్ని చూపించడానికి ప్రయత్నించానని అన్నారు. ‘నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆ రోజు ఆ నగర అనుభవం ఎదురైంది. మీ అందరి ఆశీస్సులతో రక్షణ మంత్రి అయ్యాను. వాస్తవానికి నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఆర్మీలో ఉండే ర్యాంకులపై కూడా నాకు అవగాహన లేదు. బాధ్యతలు తీసుకుంటున్న వణికి పోయాను. కానీ, ముఖాన్ని గంభీరంగా చూపించేందుకు ప్రయత్నించాను.

వాస్తవానికి ఆర్మీలో అధికారులకు ఉండే ర్యాంకుల విధానం కూడా నాకు తెలియదు. గోవాకు 1961లో పోర్చుగీసు వారి నుంచి భారత సేన విముక్తి కలిగించింది. అలాగే, 1965, 71లో యుద్ధాలు చూశాం. కార్గిల్‌ యుద్ధ సమయంలో నేను నినాదాలు ఇచ్చేవాడిని. కానీ, ఇప్పుడు నాముందుకు యుద్ధ క్షేత్రం వచ్చింది. యుద్ధం అంటే ఏమిటో కూడా తెలియదు.. దానికి ఎలా సన్నద్ధమవుతారో కూడా తెలియదు. నేను మాత్రం మన సైన్యానికి ఒకటే చెప్పాను. ఎవరైన దాడికి దిగితే వారిపై ప్రతి దాడి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉందని’ అని పారికర్‌ అన్నారు. భారత సైన్యం చాలా గొప్పగా శత్రు సేనలను వెంటాడుతోందని చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement