లక్నో: పద్నాలుగు నెలల చిన్నారి చంపక్ ఎట్టకేలకు మళ్లీ తల్లి ఒడికి చేరింది. చంపక్ తల్లి ఏక్తా శేఖర్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హక్కుల కార్యకర్తలైన ఏక్తా (32), ఆమె భర్త రవిశేఖర్ (36)లను గత నెల 19న ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపారని కన్నెర్ర చేస్తూ యూపీ పోలీసులు అరెస్టు చేసిన 73 మందిలో వీరు కూడా ఉన్నారు. ‘చంపక్ నా పాలమీద ఆధారపడిన పసికందు. తన గురించి నేను ఎంతో ఆందోళన చెందాను. ఇది నాకు చాలా కష్టకాలం’ అని బెయిల్‌పైన విడుదలైన అనంతరం ఏక్తా మీడియాకు తెలిపారు.
వారణాసికి చెందిన ఏక్తా- రవి శేఖర్ అనే దంపతులు.. వాయు కాలుష్యం- నివారణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. వీరికి 14 నెలల కూతురు చంపక్ ఉంది. కేంద్ర సర్కారు తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా.. డిసెంబరు 16న వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈ దంపతులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు దాదాపు 70 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏక్తా, రవి శేఖర్ కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వారి కుమార్తె చంపక్‌ను బంధువులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తన బామ్మ ఇంటికి పంపించారు. గత రెండువారాలుగా చంపక్ బామ్మ శీలా తీవారి సంరక్షణలో ఉంది. దాదాపు రెండువారాలపాటు ఏక్తా, రవి శేఖర్‌కు బెయిలు కూడా లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రుల కోసం అల్లాడిపోయింది. ఈ విషయం గురించి చంపక్ బామ్మ గతంలో మాట్లాడుతూ... ‘ నా కొడుకు ఎలాంటి నేరం చేయలేదు. ఐనా పోలీసులు వాడిని ఎందుకు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. అసలు తన తల్లిని చూడకుండా పసికందు ఎలా ఉండగలుగుతుంది. నిరసనలను అదుపు చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. అదే విధంగా చంపక్ పరిస్థితి గురించి మాట్లాడుతూ... ‘తనేం తినడం లేదు. ఏదో విధంగా బుజ్జగించి కొంచెం కొంచెం ఆహారం తినిపిస్తున్నాను. అమ్మా.. నాన్న అంటూ తను ఎప్పుడూ గుమ్మం వైపు చూస్తోంది. వాళ్ల కోసం ఏడుస్తోంది. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment