
అర్జన్ సింగ్ ఇక లేరు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) తీవ్ర గుండెపోటుతో శనివారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవాలు కొద్దిసేపటి క్రితమే ఆర్మీ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు.
భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్‌తో సమానమైన డిస్టింక్షన్‌ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్‌లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్‌గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్‌కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం.