ప్రతినెలా వస్తున్న ప్రధానిని నేనే: మోదీ
ఇంతకుముందు ప్రధానమంత్రులు తమ పదవీకాలం మొత్తమ్మీద ఒకటి రెండు సార్లు మాత్రమే జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి వచ్చేవారని, కానీ ప్రతి నెలా వస్తున్న ప్రధానమంత్రిని తానేనని నరేంద్రమోదీ అన్నారు. రెండోదశ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఉధంపూర్, జమ్ము తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిసారీ తాను అభివృద్ధి ప్రణాళికలతో మీ ముందుకు వస్తున్నానని, ఈ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు తాను ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా తక్షణ సాయం అందించానని గుర్తుచేశారు.
ఎవరైనా దీపావళిని తమ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలనుకుంటారని, కానీ వరదల కారణంగా బాధపడుతున్న ఇక్కడివారితో దీపావళి చేసుకోవాలని తాను భావించానని, అందుకే సియాచిన్ వెళ్లి అక్కడ సైనికులతో పండగ చేసుకున్నానని అన్నారు. ఇదంతా తాను చేసింది రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో కాదని ఆయన చెప్పారు. అవినీతి, దోపిడీ, మనోభావాలతో బ్లాక్ మెయిల్ చేయడం ఇక్కడి నాయకులకు అలవాటైపోయిందని మండిపడ్డారు. జమ్ము కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయిస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.