న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్ అండగా నిలిచారు. సోనియా ఆదర్శవంతమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. అయితే, అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని కుమార్ అంగీకరించారు.
కాగా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కూడా అశ్వినీ కుమార్‌తో శ్రుతి కలిపారు. క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. సోనియా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రిటైర్డ్ కాకూడదని మరో నేత వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు రాహుల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని మరో నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.