'నేను నోరు తెరిస్తే.. దేశం వణుకుద్ది'
ముంబై: నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి, శివసేనతో పార్టీ కలవడానికి తానే కారణమని చెప్పారు. లేకపోతే సేనకు చెందిన నాయకుడే రాష్ట్రంలో సీఎం అయ్యేవారని అన్నారు.
అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్తాన్ లో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్, ల్యాండ్ డీల్స్ తదితర వివాదాల్లో ఖడ్సే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు ఒత్తిడి పెంచడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాగా, ఖడ్సేకు దావూ్ద్ తో ఎప్పటినుంచో సంబధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశాన్ని వణికించే సమాచారం తన వద్ద ఉందని చెబుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ, కాంగ్రెస్ ల అధికార ప్రతినిధులు ఖడ్సేను వెంటనే కస్టడీకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.