'పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా?'
ముంబై : 'భారత్ మాతా కీ జై' నినాదం తాలూకూ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఇక్కడ బతకాలని అనుకుంటే 'భారత్ మాతా కీ జై' అని అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ నినాదం చేయనివాళ్లకు దేశంలో నివసించే హక్కు లేదని, భారత్ మాతా కీ జై అనకపోతే మరేమంటారు? పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి ఈ విషయంపై మాట్లాడుతూ.. ఒక్కసారి ముంబైలోని మజార్ ప్రాంతానికి వెళ్లి చూడండి. ఎంతమంది ముస్లిం మత పెద్దలు భారత్ మాతా కీ జై నినాదాన్ని పఠిస్తుంటారో తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది.
ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి వివాదాస్పద స్టేట్మెంట్లు ఇచ్చేముందు ఆలోచించాలన్నారు. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని తెలిపారు.
మరోవైపు ముస్లింలు 'భారత్ మాతా కీ జై' అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.