కార్పొరేట్ జాబ్‌ను తిరస్కరించిన ఐఐటీ టాపర్
కోల్‌కతా: కార్పొరేట్ కొలువు అంటే.. లక్షల్లో వేతనాలు, విలాసవంతమైన జీవితం. ఇవన్నీ వద్దానుకున్నాడో ఐఐటీ టాప్ ర్యాంకర్. ఇష్టమైన రంగంలో పరిశోధనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. శిఖర్ పట్రానబిస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-ఖరగ్‌పూర్‌లో బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) విద్యార్థి. ఈ ఏడాది 9.87 స్కోర్‌తో అన్ని డిపార్టుమెంట్లలో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. హయ్యెస్ట్ ర్యాంక్డ్ గ్రాడ్యుయేట్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్‌కు కూడా ఎంపికయ్యాడు. శిఖర్ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ అతడికి ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.
భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్‌ను శిఖర్ తిరస్కరించాడు. ఐఐటీ క్యాంపస్‌లోనే ఉంటూ ‘హార్డ్‌వేర్ సెక్యూరిటీ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్’పై పీహెచ్‌డీ చేస్తానని చెప్పాడు. బీటెక్ తర్వాత కార్పొరేట్ జాబ్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, పరిశోధనలపైనే ఆసక్తి ఉందని తెలిపాడు.