కామారెడ్డిలోని చికెన్ సెంటర్ల ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
సాక్షి, కామారెడ్డి: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎంత పోటీ పడినా, ధర విషయంలో మాత్రం కలిసే నిర్ణయిస్తాయి. వాళ్లు చెప్పిన ధరే చెల్లుబాటవుతుంది. రోజూ లైవ్ బర్డ్, డ్రెస్స్‌డ్ చికెన్, స్కిన్‌లెస్ చికెన్ ధరలను నిర్ణయించి పత్రికల ద్వారా వెల్లడిస్తారు. ఆ రేట్ల ప్రకారమే రాష్ట్రమంతటా విక్రయాలు జరుగుతాయి. కానీ కామారెడ్డి మార్కెట్‌లో ఎక్కడికి వెళ్లినా ‘ఈ రోజు పేపర్ రేటుపై కిలోకు రూ. 30 తక్కువ’అన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో పాటు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. కిలో చికెన్ కొంటే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తుంటారు.
రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గింపు..
కామారెడ్డి పట్టణంలో హోల్‌సెల్ చికెన్ సెంటర్లు దాదాపు 40 ఉండగా, రిటైల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. కామారెడ్డి మినహా మిగతా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్తే పత్రిక ధర ప్రకారమే చికెన్ విక్రయాలు సాగుతాయి. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా కొంత ఎక్కువకే అమ్ముతారు. కామారెడ్డిలోని చికెన్ వ్యాపారులు మాత్రం ధర తగ్గించుకుని విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గింపు ఇస్తున్నారు. కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న సిరిసిల్ల వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది.
నాలుగైదేళ్లుగా ఇదే పోటీ..
కామారెడ్డి పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా ఈ పోటీ నెలకొంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిన చికెన్ వ్యాపారి.. తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితంగా అందించాడు. మరో వ్యాపారి పత్రిక ధరపై కిలోకు రూ.35 తక్కువ అన్న బోర్డు పెట్టాడు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్‌డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల జిమ్మిక్కులతో చిరు వ్యాపారులు నలిగిపోతున్నారు.
పెద్ద ఎత్తున అమ్మకాలు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఆర్డర్‌పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. కామారెడ్డికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా చికెన్ కోసం వస్తారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని సమీప గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరం ఉంటే కామారెడ్డికి వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అమ్మకాలు కొంత తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment