
మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ : మరో రెండురోజులు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం పేర్కొంది. ఇప్పటికే ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతుండగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్ధాన్, ఉత్తరాఖండ్ సహా పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, చత్తీస్‌గఢ్, ఉత్తర కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది.
రానున్న రెండ్రోజుల్లో ముంబై నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు బిహార్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలతో ఇప్పటికే బిహార్ 129 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి.