సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్ 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. సర్వర్ సమస్యతో ఇమిగ్రేషన్ చెక్ కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది.
సర్వర్ సమస్యపై ఎయిర్‌పోర్ట్‌లో బహిరంగ ప్రకటన చేయడంతో పాటు విమానాశ్రయ సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియను చేపట్టారని కొందరు ప్రయాణీకులు వెల్లడించారు. మరికొందరు ప్రయాణీకులు ఇమిగ్రేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని ట్విటర్‌లో ఫిర్యాదు చేయగా, విమానాశ్రయంలో పొడవాటి క్యూలను చూపే ఫోటోలను ట్వీట్ చేశారు.
కాగా ఎయిర్‌ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఇటీవల ఐదు గంటల పాటు మొరాయించిన కొద్దిరోజులకే ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం పట్ల అధికారుల తీరుపై ప్రయాణీకులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment