రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులకు డ్రగ్స్ ఇచ్చి..
న్యూఢిల్లీ: ముంబై-న్యూఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు తమకు డ్రగ్స్ ఇచ్చి చోరికి పాల్పడినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.12 లక్షల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు చోరి జరిగినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు.
రాజస్ధాన్‌లోని కోట స్టేషన్‌లో రైలులోని స్టాఫ్ మారారని, ఆ సమయంలో రైలులో సెక్యూరిటీ లేదని ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పారు. తనకు చెందిన రూ.50 వేల నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు మిస్సైనట్లు వెల్లడించారు. తమకు డ్రగ్స్ ఇవ్వడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయామని తెల్లవారే వరకూ అసలు స్పృహ లేదని తెలిపారు.
దొంగతనం జరిగిందని ఓ మహిళ కేకలు వేసే వరకూ తమకు తెలియలేదని చెప్పారు. దాదాపు ఆరుగురు ప్రయాణికులకు చెందిన వస్తువులు చోరికి గురయ్యారని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.