
జయమ్మ ఝలక్.. ఒంటరి సవారీకి 'సై'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోసారి పెద్ద ఎత్తున రాజకీయ మేథోమదనానికి తెరతీశారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం ఆమెకే అని వెల్లడైన సర్వేల ఫలితాలో లేక.. ఒంటరిగానే ఎన్నికల్లో దూసుకెళ్లి తన పవర్ ఏమిటో మరోసారి తమిళనాట రాజకీయ వర్గాలకు రుచి చూపించాలనుకునే సాహసమో ఆమె మొత్తానికి అందరూ అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నారు.
మిత్ర పక్షాలకు కనీసం చేయి కూడా దులపకుండా దాదాపు అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఝలక్ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ఏడు స్థానాలు తప్ప మిగితా 227 స్థానాల్లో ఏఐడీఎంకే పోటీ చేస్తుందని ఆమె సోమవారం స్పష్టం చేశారు. ఆ అభ్యర్థుల వివారలు కూడా ప్రకటించారు.
జయలలిత మాత్రం ఇది వరకే పోటీ చేసిన చెన్నైలోని ఆర్కే నగర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మిత్ర పక్షాలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే మిగిల్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఏఐఏడీఎంకే 160 స్థానాల్లో పోటీ చేసి మిగితా సీట్లను మిత్ర పక్షాలకు ఇచ్చింది. పది మిత్ర పక్షాలను వెంటపెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. కాగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 63 స్థానాలు కేటాయించిన డీఎంకే దాదాపు 22 స్థానాలు తగ్గించి 41 స్థానాలకే తగ్గించారు. ఏదైమైనా అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగా అధికారం దక్కించుకోవాలని గట్టిగానే కసరత్తు చేసి సీట్ల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సీఎం అభ్యర్థి రేసులో తాను కూడా ఉన్నానంటూ దూసుకొస్తున్న అంతకుముందు జయతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడిన డీఎండీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ కాంత్, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో పొత్తుపెట్టుకొని ఎన్నికల బరిలో దిగారు.