మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ | Income Tax Amendment Bill: Pay 50% tax on unaccounted deposits | Sakshi
Sakshi News home page

మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ

Published Tue, Nov 29 2016 2:50 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ - Sakshi

మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ

మేం పట్టుకుంటే..85%
డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను
♦ స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే
♦ మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు
♦ మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్‌.. వడ్డీ ఉండదు
♦ దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం
♦ ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్‌ యోజన పేరుతో కొత్త పథకం
♦ స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్‌ 30
♦ వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను
♦ ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు
♦ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ
పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న సొమ్ములో నల్లధనాన్ని బయటికి లాగేందుకు కఠిన చర్యలు ప్రకటించింది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికంటూ మరో అవకాశమిచ్చింది. ఇందుకోసం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సవరణలు చేస్తూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పెద్దనోట్లు రద్దయిన తర్వాత నుంచి బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లలో.. ఆదాయ వివరాలను వెల్లడించని మొత్తాన్ని ప్రజలు డిసెంబర్‌ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటిస్తే... దానిపై 50 శాతం వరకూ పన్ను (జరిమానా, సర్‌చార్జీతో కలిపి) చెల్లించి బయటపడొచ్చని కేంద్రం ప్రకటించింది.

దీంతోపాటు ఈ లెక్కచెప్పని ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు (లాకిన్‌). ఈ వ్యవధికిగాను కేంద్రం ఎలాంటి వడ్డీ కూడా చెల్లించదు.  మిగిలిన 25 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక వివరాలు వెల్లడించని మొత్తాలను ఐటీ శాఖ గనుక తన సోదాలు, పరిశీలనలో పట్టుకుంటే దానిపై ఏకంగా 85 శాతం వరకూ పన్ను(జరిమానా, సర్‌చార్జితో కలిపి) కట్టాల్సి ఉంటుంది.

ఇప్పటిదాకా రూ.8 లక్షల కోట్ల జమ
నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ(డీమోనిటైజేషన్‌) ఈ నెల 8 రాత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్దనున్న పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో రూ.4 వేల చొప్పున మార్చుకోవడానికి మొదట డిసెంబర్‌ 31 వరకు గడువిచ్చిన సర్కారు (ఆర్‌బీఐలో మార్చుకోవడానికి మార్చి చివరిదాకా) ఆ తర్వాత దాన్ని ఈ నెల 24తో నిలిపివేసింది. అయితే ప్రజలు తమ వద్దనున్న పెద్దనోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్‌ 31 వరకు గడువిచ్చింది. కాగా డీమోనిటైజేషన్‌ తర్వాత ఇప్పటివరకూ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు జమైనట్లు అంచనా.

పన్ను మీద పన్ను... జరిమానా!
బ్యాంకుల్లో జమవుతున్న డిపాజిట్లలో (రూ.500; రూ.1,000 నోట్ల రూపంలో) నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించని మొత్తం) స్వచ్ఛందగా వెల్లడించేలా ప్రభుత్వం ఐటీ చట్టాల సవరణ బిల్లులో ప్రతిపాదించింది. దీనికోసం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై)–2016 పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్‌ కింద డిపాజిట్‌లలో నల్లధనాన్ని ప్రకటించినవారికి ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తారు. ఈ 30 శాతం పన్నుపై 33 శాతాన్ని పీఎంజీకే సెస్సు రూపంలో వసూలు చేస్తారు. ఇది మరో 10 శాతం పన్ను కింద లెక్క. అదనంగా మరో 10 శాతాన్ని జరిమానాగా కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే లెక్కచూపని మొత్తంపై 50 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

పీఎంజీఎస్‌కే స్కీమ్‌ ఇదీ...
డీమోనిటైజేషన్‌ తర్వాత డిపాజిట్‌ చేస్తున్న సొమ్ములో నల్లధనం ఉన్నవారు దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించిన పక్షంలో అందులో 25 శాతాన్ని పీఎంజీఎస్‌కే స్కీమ్‌లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ముపై నాలుగేళ్ల లాకిన్‌ వ్యవధిని విధిస్తారు. అంటే నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకునే వీలుండదు. అదేవిధంగా ఈ పథకంలో జమ చేసిన మొత్తంపై ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వడ్డీని కూడా చెల్లించదు. రిజర్వ్‌ బ్యాంక్‌తో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ఈ స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. ఈ స్కీమ్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అంటే.. సాగునీరు, ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం ఇతరత్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పక్కర్లేదు: అధియా
పీఎంజీకేవై స్కీమ్‌ వర్తింపు ఈ నెల 10 నుంచి జమ అయిన డాపాజిట్లకే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా పేర్కొన్నారు. చివరి తేదీని బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై చేయనున్నామని... దాదాపు డిసెంబర్‌ 30 వరకూ అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. ఫైనాన్స్‌ చట్టం–2016లో కొత్తగా చాప్టర్‌ 9 కింద పీఎంజీఎస్‌కేను చేర్చినట్లు వివరించారు. ‘పీఎంజీకేవై స్కీమ్‌ కింద వెల్లడించిన ఆదాయ వివరాలకు సంబంధించి ఖాతాలో డిపాజిట్‌ అయిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వివరాలు చెప్పాల్సిందిగా ఐటీ శాఖ ప్రశ్నించదు. సంపద పన్ను, సివిల్‌ చట్టాలు, ఇతరత్రా పన్ను చట్టాల నుంచి దీనికి రక్షణ ఉంటుంది. అయితే ఫెమా, పీఎంఎల్‌ఏ, నార్కోటిక్స్, బ్లాక్‌మనీ చట్టాల నుంచి మాత్రం దీనికి ఎలాంటి రక్షణ ఉండదు’ అని అధియా వివరించారు.

ఐటీ శాఖ పట్టుకుంటే గుల్లే...
డిపాజిట్లలో బ్లాక్‌ మనీ ఉండి.. దాన్ని గనక ఐటీ శాఖ పట్టుకుంటే పన్ను, జరిమానా భారీగా విధించేలా ఐటీ చట్టాల్లో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. దీనిప్రకారం పీఎంజీకేవై స్కీమ్‌ గడువు పూర్తయ్యాక ప్రజలు నల్లధనం వివరాలను వెల్లడించినా.. లేదంటే ఆ తర్వాత ఐటీ శాఖ బయటపెట్టినా.. సదరు నల్లధనంపై 60 శాతం పన్ను విధిస్తారు. ఈ పన్నుపై మరో 25 శాతం సర్‌చార్జి (అంటే 15 శాతం అదనపు పన్ను) ఉంటుంది. మొత్తం కలిపితే 75 శాతం పన్ను విధించనున్నారు. అంతేకాదు ఆదాయ పన్ను (ఐటీ) అసెసింగ్‌ అధికారి అవసరమైతే ఈ 75 శాతం పన్నుకు అదనంగా మరో 10 శాతం జరిమానాను కూడా విధించేలా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. అంటే పట్టుకున్న నల్లధనంలో 85 శాతం వరకూ ప్రభుత్వపరం అవుతుందన్నమాట.

ప్రస్తుత నిబంధనలూ కొనసాగుతాయ్‌...
ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం (అండర్‌ రిపోర్టింగ్‌), లెక్కలు తారుమారు చేయడం (మిస్‌రిపోర్టింగ్‌) వంటి సందర్భాల్లో ఐటీ శాఖ విధిస్తున్న ప్రస్తుత జరిమానా నిబంధనలు చట్టంలో యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. వీటికి ఎలాంటి సవరణలు చేయడం లేదని తేల్చిచెప్పింది. అండర్‌ రిపోర్టింగ్‌కు సంబంధిత పన్నుపై 50 శాతం జరిమానా, మిస్‌ రిపోర్టింగ్‌కు పన్నుపై 200 శాతం జరిమానా ప్రస్తుతం అమల్లో ఉంది. ఇక ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన పన్ను చట్టాల (రెండో సవరణ) బిల్లు–2016లో ఐటీ చట్టంలోని 115బీబీఈ సెక్షన్‌ను సవరించేందుకు ప్రతిపాదించారు. దీనిప్రకారం వివరాలు వెల్లడించని డిపాజిట్లు, పెట్టుబడులు, నగదు, ఇతరత్రా ఆస్తులపై శిక్షాపూరిత పన్ను, సర్‌చార్జి, జరిమానా విధింపునకు ఈ సవరణలతో ప్రభుత్వానికి వీలవుతుంది. ఇక ఐటీ శాఖ సోదాలు–జప్తులకు సంబంధించిన కేసుల్లో పెనాల్టీ నిబంధనలను కూడా సవరించేందుకు తాజా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. దీని ప్రకారం బయటపడిన ఆదాయాన్ని నల్లధనంగా అసెసీ అంగీకరించి.. పన్ను రిటర్నులు వేసి, పన్ను చెల్లించేందుకు ఒప్పుకుంటే ఆ మొత్తంపై జరిమానాను ఇప్పుడున్న 10 శాతం నుంచి 30 శాతానికి పెంచనున్నారు. ఇతర కేసుల విషయంలో ఇప్పుడున్నట్లుగానే 60 శాతం జరిమానా కొనసాగుతుంది.

మరో ఐడీఎస్‌ లాంటిదే..
నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్‌) రెండు నెలల క్రితమే(సెప్టెంబర్‌ 30తో) ముగిసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం నల్లధనం ఉన్నవాళ్లు తమ సొమ్మును ఐటీ శాఖకు వెల్లడించి 45 శాతాన్ని పన్ను రూపంలో కట్టేస్తే చట్టబద్ధ నగదుగా మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఈ స్కీమ్‌ కింద దాదాపు దాదాపు రూ.65,250 కోట్ల నల్లధనం బయటికొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన పీఎంజీకేవై స్కీమ్‌ కూడా ఒకరకంగా ఇలాంటిదే. అయితే, ఇప్పుడు డిపాజిట్‌ చేసిన మొత్తంలో ఆదాయ వివరాలు లెక్కచెప్పని డబ్బుకు 50 శాతం పన్నును విధించనున్నారు. 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్‌ చేయడం(నాలుగేళ్ల లాకిన్‌) దీనికి అదనం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement