కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి | Incontinence tearsof the modi mother | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి

Published Tue, May 27 2014 2:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:12 PM

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి - Sakshi

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి

మోడీ ప్రమాణాన్ని టీవీలో చూసిన తల్లి  భార్య యశోదాబెన్ హర్షం
 
అహ్మదాబాద్: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని ఆయన కుటుంబ సభ్యులెవరూ ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. ఆయన తల్లి హీరాబెన్(92), భార్య యశోదాబెన్, ఇతర కుటుంబ సభ్యులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించి సంతోషంతో ఉప్పొంగిపోయారు. హీరాబెన్ ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భర్త ప్రధాని కావడంతో యశోద హర్షం వ్యక్తం చేశారు. వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల ఢిల్లీ వెళ్లలేకపోయిన హీరాబెన్ గాంధీనగర్‌లోని తన చిన్నకుమారుడు పంకజ్  ఇంట్లో చిన్న గదిలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ప్రమాణాన్ని చూశారు. మోడీ వేదికపైకి రాగానే వారు ఆయన తరచూ ఇచ్చే ‘భారత్ మాతాకీ జై ’, ‘వందే మాతరం’ నినాదాలు చేశారు. మోడీ ప్రమాణం చేస్తుండగా హీరాబెన్, పంకజ్‌ల కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. హీరాబెన్ స్పందన తెలుసుకోవడానికి వచ్చిన కెమెరామెన్లు, విలేకర్లతో గది నిండిపోయినా ఆమె మాత్రం స్థిమితంగానే కనిపించారు. కార్యక్రమం తర్వాత కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోపక్క.. మెహ్‌సనాలో యశోదాబెన్ టీవీలో ప్రమాణాన్ని చూసి సంతోషభరితులయ్యారు. మోడీ సొంతూరు వాద్‌నగర్‌లోనూ సంబరాలు మిన్నంటాయి. స్థానికులు బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. గుజరాత్ అంతటా బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

 ‘మా కుటుంబానికి గర్వకారణం‘: మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబం గర్వంతో ఉప్పొంగిపోతోంది. ‘నరేంద్రబాయ్ ప్రధాని అయినందుకు చాలా సంతోషం. ఇది మా కుటుంబానికి గర్వకారణం, సంతోషదాయకం’ అని అహ్మదాబాద్‌లో ఉంటున్న ఆయన తమ్ముడు ప్రహ్లాద్ మోడీ చెప్పారు. తాము ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఉండాల్సిందని, అయితే మోడీ దృష్టి పక్కకు మళ్లకూడదనే ఢిల్లీ వెళ్లకుండా టీవీలో చూడాలని అనుకున్నామన్నారు. తన కుటుంబంపై పక్షపాతం చూపుతున్నారని మోడీని ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేందుకు కూడా తామెవరం ఢిల్లీ వెళ్లలేదన్నారు. ఇదే కారణంతో తాము ఢిల్లీ వెళ్లలేదని మోడీ అన్న సోమాభాయ్ చెప్పారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement