ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ:వారం రోజుల స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని నగ రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా తన అధీనం కిందవున్న1,250 కిలోమీటర్ల రహదారి వెంట ఉన్న పోస్టర్లు, హోర్డింగులను సంబంధిత సిబ్బంది తొలగిస్తారు. చెట్లను కత్తిరిస్తారు. ఫ్లైఓవర్లకు రంగులు అద్దడంతోపాటు వాటికింద ఉన్న ఉద్యానవనాలకు మెరుగులు దిద్దుతారు, నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తారు. ఈ విషయాన్ని ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శి అరుణ్ బొరోకా వెల్లడించారు.
ప్రధాన ఫ్లైఓవర్లన్నింటిపైనా స్వాతంత్య్ర దినోత్సవం తాలూకు సందేశాలు కలిగిన బ్యానర్లను ఏర్పాటుచేస్తారు. ప్రధాన క్రాసింగ్‌ల వద్ద 4,000 జాతీయ జెండాలను ఏర్పాటుచేస్తారు. రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోట వరకు వీఐపీ మార్గాన్నికూడా త్రివర్ణ పతాకాలతో అలంకరిస్తారు. ఢిల్లీ సచివాలయం, విధానసభ, ఎల్జీ కార్యాలయం, పీడబ్ల్యూడీ ప్రధాన కార్య్యాలయం వంటి భవనాలకు విద్యుద్దీపాలను అమరుస్తారు. రింగ్ రోడ్, ఔటర్ రింగ్‌రోడ్‌పై 20ప్రధాన క్రాసింగ్ ల వద్ద 200 బ్యానర్లతో 16,000 బెలూన్లను ఏర్పాటచేస్తారు. నగరానికి గల ఎనిమిది ప్రవేశ మార్గాలను కూడా జాతీయ జెండాలు, బెలూన్లతో అలంకరిస్తారు.
11 లక్షల మొక్కలను నాటనున్న సర్కారు
వారం రోజుల స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా నగరవ్యాప్తంగా 11 లక్షల మొక్కలను నాటాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూడు లక్షల మొక్కలను అటవీ ప్రాంతంలో నాటనున్నారు. మరో లక్ష మొక్కలను ప్రజాపనుల శాఖ నాటనుంది. ఇక ఆయా కార్పొరేషన్లు లక్ష మొక్కలను నాటనున్నాయి. మిగతావాటిని కంటోన్మెంట్, ఎకో క్లబ్‌లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు నాటనున్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. శాస్త్రిపార్కు విహార్ ప్రాంతంలో ఆరోజున వెయ్యి మొక్కలనునాటతారు. వీటిలో ఔషధ, హెర్బల్ మొక్కలు కూడా ఉంటాయి.
ఎగురనున్న నాలుగువేల మువ్వన్నెల జెండాలు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున నగరంలో నాలుగు వేల మువ్వన్నెల జెండాలు ఎగరనున్నాయి. దీంతోపాటు 16 వేల బెలూన్లు కూడా నింగిలోకి దూసుకుపోనున్నాయి. ఈ విషయాన్ని సోమవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.