'అలాగని మన గొంతు విప్పకుంటే ప్రమాదమే'
న్యూఢిల్లీ: భారత్ చాలా సహనశీల దేశమని బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్నారు. ప్రతి సమాజంలో కొంత అసహనాన్ని సృష్టించే వ్యక్తులు ఉంటారని, అది హిందువుల్లోనూ, ముస్లింలోనూ అయ్యి ఉండొచ్చని చెప్పారు. ఏదేమైనా ఒక వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అన్నింటికంటే ప్రథమమైన అంశమని చెప్పారు. సహనానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తస్లిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
'భారత్ చాలా సహనంతో నిండిన దేశమని నేను భావిస్తాను. అయితే కొంతమంది ప్రజలు అసహనంతో ఉండి ఉండొచ్చు. ప్రతి సమాజంలో ఇలాంటివారు ఉండనే ఉంటారు. మనం ఇలాంటి విషయాల్లో హిందువులను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఓసారి ముస్లింల గురించి కూడా మాట్లాడాలి. కొంతమంది వ్యక్తులకు కొన్ని విషయాలు నచ్చకపోయినా భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు మన అభిప్రాయాలను వెల్లడించాలి. మనం మన గొంతు విప్పకుంటే దేశానికి, సమాజానికి అంతమంచిది కాదు. మత ప్రాతిపదికన చేసిన ఎలాంటి చెడుపనులనైనా మనం వ్యతిరేకించాల్సిందే' అని ఆమె అభిప్రాయపడ్డారు.