పీఓకేలో ముగ్గురు ‘రా’ ఏజెంట్ల అరెస్ట్
ఇస్లామాబాద్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ముగ్గురు అనుమానిత రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్లను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిని రావల్‌కోట్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టినట్లు పాక్ వార్తా పత్రిక డాన్ పేర్కొంది. వారు పీఓకేలోని అబ్బాస్‌పూర్ తారోటి గ్రామానికి చెందిన వారని తెలిపింది. ప్రధాన అనుమానితుడు ఖలీల్ 2014 నవంబర్‌లో పూంచ్‌లో పర్యటించి రా అధికారులతో పరిచయం పెంచుకున్నట్లు డీఎస్పీ సాజిద్ చెప్పారు. ఉగ్ర వ్యతిరేక చట్టం కింద ముగ్గురిపై కేసులు నమోదుచేశారు.
పాక్‌తో భారత్ చర్చల రద్దు
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో పాక్‌తో ఢిల్లీలో సముద్ర భద్రతపై వచ్చే వారం జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకుంది. జాధవ్‌ను తమ దౌత్యవేత్తలు కలిసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు.
బీఎస్‌ఎఫ్ కాల్పుల్లో ఆందోళనకారుడి మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లోని బట్మలూ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆందోళనకారులపై శనివారం జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. బట్మలూ ప్రాంతంలోని బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) జవాన్లపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో జవాన్లు కాల్పులు జరపడంతో బారాముల్లా జిల్లాకు చెందిన సజ్జద్ అహ్మద్ (23) అనే యువకుడు మరణించాడు.