
‘నా బ్రెయిన్‌లో ప్రతికణం భారతీయతే’
బెంగళూరు: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత్‌ను మరోసారి పొగడ్తల్లో ముంచెత్తారు. ‘భారత్ అంటే గురువు. మనమంతా ఫాలోవర్సులం’ అని ఆయన చెప్పారు. మంగళవారం బెంగళూరులో ‘సామాజిక న్యాయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్‌లో పాల్గొన్న ఆయన ఇప్పటికీ అందరం సుభిక్షంగా ఉన్నామంటే అది భారతీయ ప్రాచీన భారతీయ సమాజం విలువలు, జ్ఞాన సంపదే కారణం అని చెప్పారు. అందుకే తన దృష్టిలో భారత్ గురువు అని చెప్పారు.
‘నన్ను నేను భారతీయుడిగానే భావిస్తాను.. నా మెదడులోని ప్రతి కణం కూడా ప్రాచీన భారతీయ సమాజ జ్ఞానం, విలువలతో నిండిపోయింది.. అలాగే, నా శరీరం అంటే భారతీయ రైస్, దాల్’ అని దలైలామా అన్నారు. భూస్వామ్య వ్యవస్థ కారణంగానే కులవ్యవస్థ పుట్టుకొచ్చిందన్న ఆయన దాని వల్లే సామాజిక న్యాయం కొరవడిందని చెప్పారు. కుల వ్యవస్థ అనేది భారతీయ సమాజంలో ప్రతికూల దృక్పథంగా మిగిలిపోయిందని, దానిని తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొన్నిచోట్ల మతం పేరుతో భూస్వామ్య విధానాలు కనబరుస్తున్నారని, అవి అలా ఉండకూడదని, దానిని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందని తెలిపారు.