విదేశీయుల కోసం ‘ఈ-వీసా’ | India Launches e-Visa Facility for 43 Nations | Sakshi
Sakshi News home page

విదేశీయుల కోసం ‘ఈ-వీసా’

Published Fri, Nov 28 2014 1:35 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

విదేశీయుల కోసం ‘ఈ-వీసా’ - Sakshi

విదేశీయుల కోసం ‘ఈ-వీసా’

ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
 
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. తొలిదశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్‌తోపాటు 43 దేశాలకు చెం దిన పర్యాటకులకు ఈ-వీసా అందుబాటులోకి రానుంది. భారత్‌లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. జీడీపీలో 7 శాతం పర్యాటక రంగం నుంచే వస్తోం దని, దీన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ-వీసాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విదేశీ పర్యాటకులు ఈ-వీసా కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా పరిష్కరిస్తారు. రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, యూఏఈ, జోర్దాన్, కెన్యా, ఫిజీ, ఫిన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, మారిషస్, మెక్సికో, నార్వే, ఒమన్, ఫిలిప్ఫీన్స్ తదితర దేశాల యాత్రికులకు ఈ సౌకర్యం కల్పించారు. ‘హై రిస్క్’ దేశాలను మినహాయించి దశలవారీగా అన్ని దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని రాజ్‌నాథ్ చెప్పారు.

ఇప్పటికే ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం ఉన్నా కొంత జాప్యం జరుగుతుండటంతో ఈ-వీసా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశ పర్యాటక రంగంలో ఇది చరిత్రాత్మక దినమని పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరగా రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ సదుపాయం కల్పించాలని దీర్ఘకాలంగా తాము కోరుతున్నట్లు భారత టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ గోయల్ చెప్పారు. ఈ-వీసా 30 రోజుల పాటు చెల్లుతుంది. ఓ పర్యాటకుడు ఏటా రెండుసార్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కోచి, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ-వీసా సేవలను విదేశీ యాత్రికులు వినియోగించుకోవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement