అమెరికా నుంచి మనకు భారీగా ఆయుధాలు
అమెరికా నుంచి మనకు భారీగా ఆయుధాలు
Published Thu, Dec 1 2016 8:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
అమెరికా నుంచి మన దేశం భారీ ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఎం777 తరహా అతి తేలికైన హోవిట్జర్ గన్స్ కొనుగోలుకు రూ. 5వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. వీటిని ఎక్కువగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. 1980లలో బయటపడిన బోఫోర్స్ స్కాం తర్వాత ఈ తరహా ఆర్టిలరీ గన్స్ కొనుగోలుకు జరిగిన మొట్టమొదటి ఒప్పందం ఇది. అమెరికా నుంచి ఈ తరహా గన్స్ కొనుగోలుకు సంబంధించి 'లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్' మీద భారతదేశం సంతకం చేసింది. మొత్తం 145 గన్స్ కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. భారత అమెరికా సైనిక సహకార బృందం 15వ సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
ఎం777 తరహా గన్స్ కొనుగోలుకు తాము ఆసక్తిగా ఉన్నామంటూ భారత ప్రభుత్వం ఇంతకుముందే ఆమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. వీటి బరువు చాలా తక్కువగా ఉండటంతో.. హెలికాప్టర్లతో కూడా తరలించి, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఉంటుంది. దానికి అమెరికా కూడా స్పందించడంతో రక్షణ శాఖ దానికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలించింది. ముందుగా 25 గన్స్ భారతదేశానికి వస్తాయి. మిగిలిన వాటిని మహీంద్రా సంస్థ భాగస్వామ్యంతో ఇక్కడే ఏర్పాటుచేసే అసెంబ్లీ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీలో అసెంబుల్ చేస్తారు. ఒప్పందం కుదిరిన ఆరు నెలల్లోగా మొదటి రెండు హోవిట్జర్లను అందిస్తారు. మిగిలినవి నెలకు రెండు చొప్పున వస్తాయి.
Advertisement