ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.
2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్‌ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్‌ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.
చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment