
కోల్‌కతా: ఈనెల 21న∙సూర్యగ్రహణం సంభవించనుంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా కనిపిస్తాడు. గ్రహణంవేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు కనిపించడమే రింగ్ ఆఫ్ ఫైర్. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణమే ఉంటుంది. రాజస్తాన్‌లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై.. 11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50 గంటలకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ వెల్లడించారు.
రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని కురుక్షేత్ర, సిర్సా, రథియా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, చంబా, చమోలీ, జోషిమఠ్‌ల్లో ఆ నిమిషం పాటు ఆ రింగ్ ఆఫ్ ఫైర్‌ను వీక్షించవచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 26న కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించదని దురై తెలిపారు. ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.48 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10.22 గంటల నుంచి మధ్యాహ్నం 1.41 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 10.13 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది.