
యుద్ధానికి భారత్ సిద్ధం?
- డోక్లామ్‌కు సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తున్న భారత ఆర్మీ
- ఇప్పటికే నథాంగ్ గ్రామానికి ఆదేశాలు
- సైన్యం వస్తోందని స్పష్టం చేసిన గ్రామస్థులు
- యుద్ధం వస్తే ప్రజలకు ఏం కాకుడదనే సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకే భారత ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాలకు గత రెండు నెలలుగా కొనసాగుతున్న వివాదానికి కారణమైన డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోని సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తోంది. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం నథాంగ్ అనే గ్రామంలో ఉన్న ప్రజలను వెంటనే వారి ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి వేలమంది సైనికులను తరలిస్తోంది. ఈ ప్రాంతం వివాదానికి కారణమైన డోక్లామ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ చైనా మీడియా పేర్కొనడం, ఆ మరుసటి రోజే డోక్లామ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం నిజంగానే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అనే అనుమానానికి తావిస్తోంది. అయితే, నిజంగానే యుద్ధం జరిగితే ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోకూడదని ముందస్తు జాగ్రత్త మేరకే సైన్యం ఈ పనిచేస్తోందని సమాచారం. నథాంగ్ గ్రామస్తులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో సైనికులు వస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్మీ మూవ్‌మెంట్‌పై అధికారికంగా ఆర్మీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోపక్క, డోక్లామ్ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ ముందునుంచే చైనా బెదిరింపులకు లొంగని విషయం తెలిసిందే.