ఈ బాలుడుకి దివ్య దృష్టి
ఢిల్లీ: కనిపించకుండా కళ్లకు గంతలు కట్టుకొని బైకులు నడిపే వారిని మనం తరచుగా చూస్తుంటాం. ఢిల్లీకి చెందిన ఈ పదేళ్ల బాలుడు మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని బైక్ నడపడమే కాదు, రంగుల బంతుల్లో ఏదీ ఏ రంగులో ఉందో, ఏ రంగు ఏ షేడ్‌లో ఉందో కూడా గుర్తుపడతాడు. అంతేకాకుండా తోటి పాఠశాల విద్యార్థులను వరుసగా నిలబడితే దగ్గరికి వెళ్లి ఎవరు ఎక్కడున్నారో గుర్తిస్తాడు. తెలిసిన పరిసర ప్రాంతాల్లో ఏ మోరీ ఎక్కడుందో, ఏ గుంత ఎక్కడుందో గుర్తు పట్టి కళ్లతో చూసినట్టుగానే దాటేస్తాడు. వికాస్ పంచల్ అనే విద్యార్థి కళ్లకు గంతలు కట్టుకొని చేసిన ఈ ఫీట్లను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
రోజుకు రెండు గంటలపాటు తన మెదడుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా తాను ఈ దివ్వ దృష్టిని సాధించానని వికాస్ తెలిపాడు. మధ్య మెదడును క్రియాశీలకం చేయడం వల్ల గతంలో మనం చూసిన ఏ దృశ్యాన్ని గానీ వస్తువునుగానీ, మాటలనుగానీ మరిచిపోమని, అవి మెదడులో నిక్షిప్తమై ఉంటాయని వికాస్ చెప్పాడు.
తనకు గతంలో ఏం చదివినా మెదడుకు ఎక్కేదికాదని, ఏది గుర్తుండేది కాదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవాడినని, మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ సమస్యలన్నింటినీ అధిగమించానని తెలిపాడు. ప్రతి వస్తువుకుండే ప్రత్యేకమైన వాసన ద్వారా వివిధ వస్తువులను, రంగులను, గుంపులో మనుషులను తాను గుర్తించగలుగుతున్నానని చెప్పాడు. తాను భవిష్యత్తులో శాస్త్రవేత్తనై దేశానికి సేవ చేయాలనుకుంటున్నానని చెప్పాడు.
ఇది ఒకరకమైన మెడిటేషన్ అని, మనిషికి రెండు మెదళ్లు ఉంటాయని, అందులో ఒకటి స్తబ్ధుగా ఉంటుందని, దాన్ని క్రియాశీలకం చేయడం ద్వారా వికాస్ లాంటి విద్యలు చేయవచ్చని అతనికి శిక్షణ ఇస్తున్న గురువు శ్రీ భగవాన్ తెలిపారు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలకే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు.