ముంబై: అత్యంత ఎక్కువగా కష్టపడి పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ‘ఇప్పుడు మీరు పొందుతున్నంత వేతనమే తీసుకుంటూ కూడా ప్రతీ వారంలో మీరు పనిచేసే రోజులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటే మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించగా.. తాము పనిదినాలను తగ్గించుకోబోమనీ, వారానికి ఐదు రోజులు పనిచేస్తామని 69 శాతం మంది భారతీయ ఉద్యోగులు చెప్పారు.
మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. పనిదినాలను తగ్గించుకుంటే ఆ మేరకు వేతనాన్ని కూడా స్వచ్ఛందంగా తగ్గించుకుంటామని 43% మంది భారతీయ ఉద్యోగులు చెప్పారు. ఒకే వేతనం పొందే అవకాశం ఉన్నా పనిదినాలను తగ్గించుకోబోమని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 43%, అమెరికాలో 27%, ఆస్ట్రేలియాలో 19 శాతమే ఉంది. అమెరికాకు చెందిన క్రోనోస్ అనే కంపెనీ, ఫ్యూచర్ వర్క్‌ప్లేస్ అనే మరో కంపెనీతో 8 దేశాల్లో ఈ సర్వే చేయించింది.
ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, మెక్సికో, బ్రిటన్, అమెరికాల్లో ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తంగా 2,772 మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వేతనం ఇప్పుడున్నంతే ఉంటే తాము వారానికి నాలుగు రోజులు పనిచేస్తే బాగుంటుందని 34% మంది, మూడు రోజులే పనిచేస్తామని 20% మంది చెప్పారు. తాము వారానికి ఐదు రోజులే పనిచేస్తామనీ, ఒకవేళ పనిదినాలు ఇంకా తగ్గించుకుంటే ఒక్కో పనిదినానికి 20% వేతనాన్ని కూడా తగ్గించుకుంటామని 35 శాతం మంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment