Hard workers
-
భారతీయులే అత్యంత శ్రమజీవులు
ముంబై: అత్యంత ఎక్కువగా కష్టపడి పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ‘ఇప్పుడు మీరు పొందుతున్నంత వేతనమే తీసుకుంటూ కూడా ప్రతీ వారంలో మీరు పనిచేసే రోజులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటే మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించగా.. తాము పనిదినాలను తగ్గించుకోబోమనీ, వారానికి ఐదు రోజులు పనిచేస్తామని 69 శాతం మంది భారతీయ ఉద్యోగులు చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. పనిదినాలను తగ్గించుకుంటే ఆ మేరకు వేతనాన్ని కూడా స్వచ్ఛందంగా తగ్గించుకుంటామని 43% మంది భారతీయ ఉద్యోగులు చెప్పారు. ఒకే వేతనం పొందే అవకాశం ఉన్నా పనిదినాలను తగ్గించుకోబోమని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 43%, అమెరికాలో 27%, ఆస్ట్రేలియాలో 19 శాతమే ఉంది. అమెరికాకు చెందిన క్రోనోస్ అనే కంపెనీ, ఫ్యూచర్ వర్క్‌ప్లేస్ అనే మరో కంపెనీతో 8 దేశాల్లో ఈ సర్వే చేయించింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, మెక్సికో, బ్రిటన్, అమెరికాల్లో ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తంగా 2,772 మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వేతనం ఇప్పుడున్నంతే ఉంటే తాము వారానికి నాలుగు రోజులు పనిచేస్తే బాగుంటుందని 34% మంది, మూడు రోజులే పనిచేస్తామని 20% మంది చెప్పారు. తాము వారానికి ఐదు రోజులే పనిచేస్తామనీ, ఒకవేళ పనిదినాలు ఇంకా తగ్గించుకుంటే ఒక్కో పనిదినానికి 20% వేతనాన్ని కూడా తగ్గించుకుంటామని 35 శాతం మంది చెప్పారు. -
మనోళ్లే పనిమంతులు
న్యూఢిల్లీ: నిర్ణీత పనిగంటల కంటే ఎక్కువ సేపు పనిచేసే వారిలో భారతీయ ఉద్యోగులు ముందుంటారని ఇటీవల ‘డేల్ కార్నెజీ’ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. 61 శాతం మంది అదనంగా చేసిన సమయానికి జీతాన్ని ఆశించడంలేదని తెలిపింది. 46 శాతం భారతీయులు ఇచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తిచేస్తారనీ, ఈ విషయంలో ప్రపంచ దేశాల సగటు 30 శాతమేనని తేల్చింది. 58 శాతం మంది భారతీయ ఉద్యోగులు తాము అనుకున్న పనిని కచ్చితంగా పూర్తి చేస్తున్నారనీ, కంపెనీ లక్ష్యాలు అందుకుంటున్నారనీ తెలిపింది. ఇండియాలోని పెద్ద కంపెనీలు నిపుణులైన ఉద్యోగులను నియమించుకోడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొంది. నైపుణ్యం ఉన్న 71 శాతం మంది ఉద్యోగులు రూ.కోట్లలో జీతాలు అందుకుంటున్నారని తెలిపింది. భారత జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, డేల్ కార్నెజీ సంయుక్తంగా 2014 సర్వే నిర్వహించాయి. 1,200 మంది ఉన్నతోద్యోగులను సంప్రదించి ఈ వివరాలు వెల్లడించింది. -
చీమల పుట్టలతో... పుడమికి చల్లదనం!
పిపీలికాల గురించి మీకేం తెలుసు? కష్టజీవులు.. క్రమశిక్షణతో కూడిన సంఘజీవులు.. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు.. ఇంకా? వాటిని డిస్ట్రబ్ చేస్తే మాత్రం చటుక్కున చిటుక్కుమనిపించి మంట పుట్టిస్తాయి. అప్పుడు మనకు చిరాకు పుట్టి చేతితో లేదా కాలితో నలిపేస్తాం కూడా. ఇంకా..? కొన్ని దేశాల్లో ఆహారంగా పనికొస్తాయి. మందుల తయారీకీ వాడతారట. అంతేనా? అయితే వీటి గురించి ఆశ్చర్యకరమైన ఓ కొత్త సంగతి గురించి తెలుసుకుందాం. అదేంటంటే.. చీమలు భూగోళానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయట! భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించేందుకు ఇవి పరోక్షంగా తమ వంతు సాయం చేస్తాయట. ఇవి కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను విచ్ఛిన్నం చేసి సున్నపురాయిగా స్రవిస్తాయట. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ఈ సున్నపురాయిలో నిక్షిప్తం అయిపోతుందట. అందువల్ల వాతావరణంలో నుంచి కొంత కార్బన్డయాక్సైడ్ తగ్గి, తద్వారా భూతాపోన్నతీ తగ్గుతుందన్నమాట. అదేవిధంగా చీమలు మట్టి, ఇసుక రేణువులను నోటితో కరుచుకుని తెచ్చి గోడలకు అతికిస్తూ పుట్టలను పటిష్టంగా నిర్మిస్తాయన్నది తెలిసిందే. అయితే అవి ఇసుక రేణువులను నోటితో నాకి గోడకు అతికించేటప్పుడు కూడా వాటిలో మార్పులు జరిగి కార్బన్డయాక్సైడ్ నిక్షిప్తం అవుతుందట. మామూలు ఇసుక కన్నా.. బసాల్ట్ ఇసుక రేణువులు దొరికితే ఇవి 50-300 రెట్లు వేగంగా విచ్ఛిన్నం చేసేస్తాయట. కానీ ఇంత పెద్దభూగోళానికి చీమలు చేసే సాయం చాలా చిన్నదేనని, అయినా వీటి కృషిని తక్కువచేసి చూడరాదంటున్నారు ఈ సంగతిని కనిపెట్టిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు రోనాల్డ్ డార్న్.