ఫిజీకి 500 కోట్ల రుణం, సాయం
- ప్రధాని మోదీ ప్రకటన
- పసిఫిక్ దీవి దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటన
సువా: పసిఫిక్ దీవుల్లోని ఫిజీ దేశానికి దాదాపు 500 కోట్ల రూపాయల రుణం, అభివృద్ధి సాయం అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలోని 14 దేశాల ప్రజలు భారత్ పర్యటన కోసం.. ముందుగా వీసా తీసుకోవటం కాకుండా.. భారత్‌కు వచ్చి వీసా తీసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
పది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. బుధవారం ఉదయాన్నే ఫిజీ రాజధాని సువా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ప్రభుత్వ లాంఛనాలతో రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తన పర్యటనలో 12 పసిఫిక్ ద్వీప దేశాలనేతలసమావేశంలోమోదీ ప్రసంగించారు.
బలమైన భాగస్వామ్యానికి పునాది...
ఫిజీ ప్రధానితో చర్చల అనంతరం బయినీమరామతో కలిసి మోడీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిజీతో మా సంబంధాల్లో ఇది నూతన ఆరంభం. పాత సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, భవిష్యత్తులో బలమైన భాగస్వామ్యానికి పునాది వేసేందుకు నా పర్యటన అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. భారత మార్స్ మిషన్ విజయవంతం కావటంలో ఫిజీ పోషించిన పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అంతరిక్ష రంగంలో ఫిజీని ప్రాంతీయ కేంద్రంగా మార్చేందుకు ఆ దేశంతో కలిసి కృషి చేస్తామన్నారు. (అంగారకుడిపై భారత్ ప్రయోగించిన ఉపగ్రహం మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఫిజీ, పలు ఇతర పసిఫిక్ దేశాల నుంచి నియంత్రించారు).
భారత్ ‘విశ్వగురు’ పాత్ర పోషిస్తుంది...
రాబోయే యుగం విజ్ఞానయుగం అవుతుందని.. అందులో భారత్ మరోసారి ‘విశ్వగురు’ (ప్రపంచానికి బోధకుడు) పాత్ర పోషిస్తుందని, తన ప్రజాస్వామ్య బలం, యువశక్తులను వినియోగించుకుని మానవాళికి ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఫిజీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆ దేశ పౌర సమాజ ప్రతినిధులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిజీలో రోజంతా పర్యటించిన మోదీ బుధవారం సాయంత్రం ప్రత్యేక భారత వైమానిక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షం
ఫిజీ పార్లమెంటులో ప్రతిపక్షమైన సెడెప్లా భారత ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాలను బహిష్కరించింది. పార్లమెంటులో ధన్యవాదం తెలిపేందుకు ప్రతిపక్షానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్ష నేత రో రో తీముము కెపా పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షం చర్య మన్నించరాని చర్య అని.. ఇందుకు ఫిజీ ప్రజల తరఫును తాను మోదీకి క్షమాపణ చెప్తున్నానని ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామ పార్లమెంటులో పేర్కొన్నారు.
ఫిజీలో మూడో వంతు మంది భారత సంతతి వారే...
పసిఫిక్ సముద్రంలోని దీవుల్లో.. 332కు పైగా దీవుల సమాహారం ఫిజీ. మొత్తం జనాభా 8,49,000 మంది. వీరిలో 87 శాతం మంది కేవలం రెండు ప్రధాన దీవుల్లోనే నివసిస్తుంటారు. జనాభాలో మూడో వంతు మంది భారత సంతతి వారే. 19వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ వలస పాలనలో భాగంగా.. ఫిజీలోని చెరకు సాగులో బానిస కార్మికులుగా వీరిని తరలించారు. పర్యాటకం, పంచదార పరిశ్రమ ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు. మొన్నటి వరకూ సైనిక పాలనలో ఉన్న ఫిజీ ఇటీవలే గణతంత్ర దేశంగా మారింది. అప్పటి సైనిక పాలకుడైన ఫ్రాంక్ బయినీమరామ.. తొలి ఎన్నికల్లో గెలిచి గత సెప్టెంబర్‌లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గణతంత్ర ఫిజీ పార్లమెంటులో ప్రసంగించిన తొలి విదేశీ ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు.