
భోపాల్ : రైళ్లలో మసాజ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేలు చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ మండిపడ్డారు. రైల్వేల ప్రతిపాదన చౌకబారు నిర్ణయమని ఇండోర్ ఎంపీ లాల్వానీ తప్పుపట్టారు. తోటి మహిళా ప్రయాణీకుల సమక్షంలో రైళ్లలో మసాజ్ సేవలను అందుబాటులోకి తేవడం సరైంది కాదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహిళా ప్రయాణీకులు కూడా రైళ్లలో ప్రయాణించే క్రమంలో ఆయా రైళ్లలో మసాజ్ సేవలను ప్రవేశపెట్టడం భారత సంస్కృతికి విరుద్ధమని రైల్వే మంత్రికి రాసిన లేఖలో ఆక్షేపించారు. రైలు ప్రయాణీకులకు వైద్య సేవలు కల్పించడం పక్కనపెట్టి మసాజ్ సేవలను ముందుకు తీసుకురావడం బాధ్యతారాహిత్య చర్యని ఆయన మండిపడ్డారు. కాగా రైళ్లలో మసాజ్ సేవలను నిరసిస్తూ తనను ఇటీవల కొందరు మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారని, వారి అభ్యంతరాలనే తాను రైల్వే మంత్రికి రాసిన లేఖలో పొందుపరిచానని ఎంపీ లాల్వానీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment