బాలిక దీక్ష...148 కుటుంబాలకు ప్రేరణ
♦ మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుటుంబాలు
♦ స్థానికుల్లో చైతన్యం తెచ్చిన లావణ్య
♦ అమితాబ్ ‘ఆజ్‌కి రాత్‌హై జిందగీ’ కార్యక్రమంలో ప్రస్తావన
తుమకూరు: ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాల్సిందేనంటూ ఓ బాలిక చేసిన ఉపవాస దీక్ష.. కేవలం తన ఇంట్లోనే కాక ఆ ఊరిలో ఉన్న 148 కుటుంబాలు సైతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రేరణ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ చేపట్టిన ‘ఆజ్‌కి రాత్‌హై జిందగీ’ అనే కార్యక్రమంలో ఈ చిన్నారి ప్రస్తావన రావడంతో ‘స్వచ్ఛ భారత్’లో ఆ చిన్నారిని భాగస్వామిని చేయాలని దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా శిరా తాలూకా హలేనళ్లిలోని దేవరాజు, భాగ్యమ్మ దంపతుల కుమార్తె లావణ్య చిక్కనహళ్ళిని. ఈ బాలిక శాంతలా పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శిరాలో ఏడాది కిందట వివేకానంద యూత్ క్లబ్ చేపట్టిన జాగృతి కార్యక్రమంలో లావణ్య సహ విద్యార్థులతో కలసి పాల్గొంది. కాలకృత్యాలు తీర్చేకునేందుకు ఆరుబయటకు వెళ్తే జరిగే అనర్థాలు, అనారోగ్యాలపై అవగాహన పెంచుకుంది. అదే రోజు స్వగ్రామానికి వెళ్లి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని పట్టుబట్టింది. అంతడబ్బు తమ వద్ద లేదని కూలీపనులు చేసుకునే ఆ తల్లిదండ్రులు పేర్కొన్నా లావణ్య పట్టువీడలేదు.
మరుగుదొడ్డి నిర్మించే వరకు భోజనం ముట్టనని భీష్మించుకు కూర్చుంది. రెండు రోజుల పాటు ఉపవాసం ఉంది. చేసేది లేక మరుగుదొడ్డి నిర్మిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. లావణ్యను స్ఫూర్తిగా తీసుకున్న సాటి విద్యార్థినులు తమ తల్లిదండ్రులను ఒప్పించి మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టించారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తుందని, మరుగుదొడ్ల నిర్మాణంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని లావణ్య స్థానికుల్లో చైతన్యం తెచ్చింది. దీంతో ఇటీవల గ్రామంలో మరో 148 కుటుంబాలు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాయి. లావణ్య సేవలను గుర్తించిన దేశంలోని స్వచ్ఛంద సంస్థలు ఆ చిన్నారిని ‘స్వచ్ఛ భారత్’లో భాగస్వామిని చేయాలని భావిస్తున్నాయి. అయితే లావణ్య ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. లావణ్యతో పాటు మరొకరు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి సంబంధించి దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అందుకు అవసరమైన ధన సహాయాన్ని అందజేసేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించింది.