అహ్మదాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు తీవ్ర విమర్శలకు దారితీయటంతో ప్రభుత్వం కదిలింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఘటనపై దర్యాప్తునకు నియమించినట్లు గుజరాత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరున్న అహ్మదాబాద్ ప్రభుత్వాసుప్రతిలో వరుసగా పిల్లలు చనిపోతుండటం కలకలమే రేపింది. అశర్వాలోని ఈ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా సుమారు 20 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల వ్యవధిలో(శనివారం) 9 మంది చిన్నారులు మృతి చెందటం.. ఆపై మీడియా వరుస కథనాల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ మరణాలకు ఆసుపత్రి వైఫల్యం, చికిత్సలో లోపం కారణం కాదని గుజరాత్ ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. వివిధ రకాల సమస్యలతో వారంతా మరణించారని ఆయన వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్నట్లుగా ఆసుపత్రిలో మందుల కొరత కానీ, పరికరాల కొరత కానీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నియమించిన కమిటీ ఒకటి లేదా రెండు రోజుల్లేనే నివేదిక సమర్పించనుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యంమంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment