civil hospital
-
సారూ.. ఇదేం తీరు
సాక్షి నాగర్ కర్నూల్/అచ్చంపేట రూరల్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ సెంటర్లోకి ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు. ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్‌బీ, సీపీపీ, బీజీఎఫ్ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్‌కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్ తెలిపారు. కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్‌గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు పంపడం సరికాదు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట సొంత క్లినిక్‌లకు రెఫర్ స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్‌లకు రెఫర్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. (చదవండి: పంటలకు ‘కట్’కట!) -
‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జిల్లా సివిల్ ఆసుపత్రికి నోటీసులు! రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది..? కరీంనగర్‌లోని జిల్లా సివిల్ ఆస్పత్రి– కలెక్టరేట్లో డీఆర్డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మతం ఆధారంగా ‘కరోనా’ వార్డులు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మత ఆధారిత వివక్ష వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మతం ఆధారంగా రోగులను విడివిడిగా ఉంచుతున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ఇదంతా గుజరాత్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరుగుతోందని అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా బాధితులు, అనుమానితులైన హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేసినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుణవంత్ హెచ్ రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగానే వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ‘మామూలుగా ఆస్పత్రుల్లో మహిళలు, పురుష రోగులకు వేర్వేరుగా వార్డులు ఉంటాయి. కానీ ఇక్కడ.. హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేశామ’ని డాక్టర్ రాథోడ్ చెప్పారు. ఇలా ఎందుకు విభజించారని ప్రశ్నించగా.. ‘ఇది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వాన్నే అడగండి’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్ ఆస్పత్రిలో 150 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా వీరిలో 40 మంది వరకు ముస్లింలు ఉన్నట్టు సమాచారం. మతం ఆధారంగా వార్డులను విభజించడం గురించి తనకు తెలియదని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ చెప్పడం విశేషం. అటు అహ్మదాబాద్ కలెక్టర్ కేకే నిరాళ కూడా ఇదే మాట చెప్పారు. ‘మా నుంచి అటువంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విషయం మాకు తెలియద’ని అన్నారు. (మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ?) మార్చి చివరి వారంలో అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొత్త బ్లాక్‌ను అహ్మదాబాద్-గాంధీనగర్ జోన్ కోవిడ్-19 రోగుల కోసం ప్రత్యేకించారు. కాగా, మతం ఆధారంగా వార్డుల విభజన వాస్తవమేనని ఆస్పత్రిలోని రోగులు వెల్లడించారు. ‘ఆదివారం రాత్రి ఏ-4 బ్లాక్‌లోని 28 మందిని వారి పేర్లు ఆధారంగా బయటకు పిలిచారు. తర్వాత వారిని మరోవార్డు(సీ-4)కు తరలించారు. మమ్మల్ని ఎందుకు తరలిస్తున్నారో చెప్పలేదు. ఈ 28 మంది ఒకే మతానికి చెందిన వారు. దీని గురించి మా వార్డులోని ఆస్పత్రి ఉద్యోగిని అడగ్గా 'రెండు వర్గాల సౌలభ్యం' కోసం ఇది జరిగిందని తెలిపాడ’ని రోగి ఒకరు వెల్లడించారు. -
డాక్టర్ పక్కన ఉండగానే...
చండీగఢ్ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో నిరూపించే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. డాక్టర్ పక్కన ఉండగానే ఓ వ్యక్తి చేతికి ప్యూన్ కుట్లు వేశాడు. వివరాలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి రోహతక్ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్ అతడిని పట్టించుకోకుండా పక్కన కూర్చుండిపోయాడు. సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాడు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి ప్యూన్ని పిలవగా.. గాయపడిన వ్యక్తి చేతికి అతడు కుట్లు వేశాడు. ఈ తతంగాన్నంతా ఆస్పత్రిలో ఉన్న ఓ రోగి బంధువు సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నవంబరు 10న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న వైద్యులను ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్యను పెంచేందుకు ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతుంటే డాక్టర్లు ఇలా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. -
మృత్యు ఘోష.. కదిలిన గుజరాత్ ప్రభుత్వం
అహ్మదాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు తీవ్ర విమర్శలకు దారితీయటంతో ప్రభుత్వం కదిలింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఘటనపై దర్యాప్తునకు నియమించినట్లు గుజరాత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరున్న అహ్మదాబాద్ ప్రభుత్వాసుప్రతిలో వరుసగా పిల్లలు చనిపోతుండటం కలకలమే రేపింది. అశర్వాలోని ఈ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా సుమారు 20 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల వ్యవధిలో(శనివారం) 9 మంది చిన్నారులు మృతి చెందటం.. ఆపై మీడియా వరుస కథనాల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మరణాలకు ఆసుపత్రి వైఫల్యం, చికిత్సలో లోపం కారణం కాదని గుజరాత్ ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. వివిధ రకాల సమస్యలతో వారంతా మరణించారని ఆయన వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్నట్లుగా ఆసుపత్రిలో మందుల కొరత కానీ, పరికరాల కొరత కానీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నియమించిన కమిటీ ఒకటి లేదా రెండు రోజుల్లేనే నివేదిక సమర్పించనుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యంమంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. -
మూడ్రోజుల్లో 20 మంది శిశువులు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో శనివారం ఒక్కరోజే 9 మంది శిశువులు మృతి చెందారు. దీంతో గత మూడు రోజుల్లో ఇక్కడ మృత్యువాత పడిన చిన్నారుల సంఖ్య 20కి పెరిగింది. శనివారం చనిపోయిన 9 మందిలో ఐదుగురిని వేరే ఆసుపత్రుల నుంచి వైద్యం కోసం ఇక్కడికి తరలించగా, మిగిలిన నలుగురు ఇదే ఆసుపత్రిలో జన్మించారు. వీరంతా ఐసీయూలో ఉండగానే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే శిశు మరణాలు సంభవించాయన్న వార్తలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎం ప్రభాకర్ కొట్టిపారేశారు. 24 గంటలూ వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. చనిపోయిన పిల్లల బంధువులు, కుటుంబీకులు దాడులకు పాల్పడొచ్చన్న అనుమానాలతో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శిశు మరణాలకు బాధ్యత వహిస్తూ గుజరాత్ సీఎం రూపానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరింది. -
రిమాండ్ ఖైదీ మృతి
పోలీసుల దెబ్బలతో ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి విషమించడంతో మృతి కరీంనగర్ క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల దెబ్బలు తాళలేక ఓ రిమాండ్ ఖైదీ శుక్రవారం మృతిచెందాడు. గత నెలలో ఓ చోరీ కేసులో వేములవాడలోని సాయినగర్‌కు చెందిన వెంకటేశ్(25)ను ఎల్లారెడ్డిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత పీటీ వారంట్లో మరో చోరీ కేసులో రిమాండ్ చూపారు. గతనెల 13న కరీంనగర్‌లోని జిల్లా జైలుకు పంపించారు. రిమాండ్ రిపోర్టులో వెంకటేశ్‌కు గాయాలున్నట్లు పేర్కొన్నారు. జైలుకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో జైలు సిబ్బంది గత నెల 15న కరీంనగర్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అదేనెల 21న మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలుగు రోజులు జిల్లా జైలులో చికిత్స అందించినా దెబ్బలు తగ్గలేదు. దీంతో గతనెల 26న సివిల్ ఆస్పత్రికి పంపించగా మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో ఇన్‌పేషెంట్‌గా చేర్చారు. గురువారం వెంకటేశ్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించాలని జైలు సిబ్బందికి ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగానే శుక్రవారం తెల్లవారుజామున వెంకటేశ్ మృతిచెందాడు. వెంకటేశ్ రిమాండ్ ఖైదీ కావడంతో నిబంధనల ప్రకారం జిల్లా జడ్జి, ఆర్డీవో, తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని జ్యుడీషియల్ విచారణ ప్రారంభించారు. అయితే తన భర్తను పోలీసులే కొట్టి పొట్టన బెట్టుకున్నారని వెంకటేశ్ భార్య రేణుక ఆరోపిస్తోంది. -
అవకతవకలు.. అక్రమాలు
పరకాల సివిల్ ఆస్పత్రిలో విజిలెన్ అధికారుల విచారణ నియామకాలు, కొనుగోళ్లపై ఆరా పరకాల : పరకాలలోని సివిల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్యులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం సందర్భంగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై కొంతకాలం క్రితం స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరు గంటల పాటు.. అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ విజిలెన్స అధికారులు మంగళవారం ఉదయం 10 గంటలకు పరకాల ఆస్పత్రికి చేరుకున్నారు. విజిలెన్స అధికారులు డాక్టర్ రాజశేఖర్‌బాబు, పరశురాములు విచారణ కోసం రాగా, ఆస్పత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ సంజీవయ్యను ఆరు గంటల పాటు విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరెవరో ఆరా తీశారు. తాము నిబంధనల మేరకే నియామకమైనట్లు లేఖ ఇవ్వాలని ఇద్దరు వైద్యులకు సూచించారు. అలాగే, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల పేర్లపై ఎవరైనా బినామీలుగా పనిచేస్తున్నా రా అని ఆరా తీశారు. ఆ తర్వాత పరికరాల కొనుగోలుకు సంబంధించి బిల్లులు, టెండర్ల ప్రక్రియ రఖాస్తులను పరిశీలించారు. కాగా, తమకు సక్రమంగా పీఎఫ్, ఈఎస్ఐలు కట్టడం లేదని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఫిర్యాదు చేయగా ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. అలాగే, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక పరకాల ఆస్పత్రిలో చేపట్టిన విచారణ నివేదికను రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని విజిలెన్స అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాలు, పరికరాల కొనుగోళ్లపై తాము విచారించామని తెలిపారు. -
ప్రజారోగ్యంపై సర్కారు నిర్లక్ష్యం
ముకరంపుర : ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభ్తువం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు విమర్శించారు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిని గురువారం సందర్శించి మాట్లాడారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రిలోని అధ్వాన పరిస్థితులకు నిరసనగా అక్కడే ధర్నా నిర్వహించారు. సుగుణాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల పాలనలో రోగగ్రస్థ తెలంగాణగా మారిందన్నారు. ప్రజారోగ్యంపై శ్రద్ధచూపకపోవడంతో పేదలు ప్రై వేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో మందులు, సౌకర్యాల కోసం కేంద్రం గతేడాది రూ.1105 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.400 కోట్లను వినియోగించలేదని ఆరోపించారు. ఆస్పత్రిని మరమ్మతు చేయించడంతోపాటు సిబ్బందిని నియమించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మిర్యాల్కర్ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి శంకర్, పార్లమెంట్ కన్వీనర్ హరికుమార్‌గౌడ్, నాయకులు ఆనంద్, బోళ్ల వేణు, కూడల శిరీష్, జేడీ భగవాన్, ములుగూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
పురిట్లోనే శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయిందని బంధువుల ఆరోపణ మృతశిశువుతో ఆస్పత్రి ఎదుట ధర్నా తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయిందంటున్న వైద్యులు పరకాల : అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగిన బిడ్డ.. గర్భం నుంచి బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే ప్రాణాలు విడిచింది. కనులు తెరవక ముందే కన్నుమూసింది. డ్యూటీ డాక్టర్ సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హన్మకొండ రాము–లావణ్య(సవిత)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాము పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో హమాలీ పనిచేస్తుండగా లావణ్య కూలీ పని చేస్తోంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం లావణ్య మూడోసారి గర్భం దాల్చింది. హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నరీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఏఎన్ఎం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో మంచి సదుపాయాలున్నాయని చెప్పి నిండు గర్భిణి అయిన లావణ్యను ఇక్కడికి తీసుకొచ్చింది. శుక్రవారం లావణ్యతోపాటు భర్త రాము కూడా వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు లావణ్యను ఇంటికి తీసుకెళ్లండని, నొప్పులు వస్తే తీసుకురావాలని చెప్పారు. దీంతో కామారెడ్డిపల్లికి లావణ్యను తీసుకెళ్లారు. శనివారం ఉదయం నొప్పులు రావడంతో రాము ఆమెను సివిల్ ఆస్పత్రికి తరలించాడు. అయితే డాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం రాము డ్యూటీ డాక్టర్‌కు తన భార్య విషయం చెప్పాడు. దీంతో డ్యూటీ డాక్టర్ పద్మజ వచ్చి లావణ్యను డెలివరీ కోసం గదిలోకి తీసుకెళ్లారు. సాధారణ డెలివరీతో లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు బాగానే ఉన్న శిశువుకు ఆక్సిజన్ అందించడంలో డాక్టర్లు పట్టించుకోలేదు. శిశువును ప్రైవేటు ఆస్పత్రిలో చూపించడం కోసం తీసుకుపోతుండగా మృతిచెందింది. మృతశిశువుతో ధర్నా.. ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే శిశువు చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతశిశువును చేతుల్లో పట్టుకొని ఆస్పత్రిలోకి వెళ్లకుండా బైఠాయించారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. ఎస్సై దీపక్ అక్కడకు చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతశిశివునే బయటకు తీశాం : డ్యూటీ డాక్టర్ పద్మజ ఆస్పత్రిలో చేరిన లావణ్యను పరిశీలిస్తూనే ఉన్నాం. చనిపోయిన శిశువు పూర్తిగా బయటకు వచ్చింది. అందులో మా తప్పు లేదు. డెలివరీ చేయకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం జరిగేది. విచారణ చేస్తున్నాం: డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఇన్చార్జీ సూపరింటెండెంట్ ఆస్పత్రిలో చనిపోయిన శిశువు ఘటనపై విచారణ చేస్తున్నాం. డ్యూటీ డాక్టర్ పద్మజ, ఏఎన్ఎంలు స్వరూప, వాణి ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నిర్లక్ష్యం ఉన్నట్లు తెలితే చర్యలు తీసుకుంటాం. -
స్కూల్ బస్సు బోల్తా...28 మందికి గాయాలు
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామ సమీపంలో గురువారం ఉదయం సెయింట్ ఆన్స్‌కు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మూలసాల, కొత్తపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని బోజన్నపేట చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే పెద్దపల్లి సీఐ ప్రశాంత్‌రెడ్డి, ఎస్సైలు జగన్మోహన్, రవికుమార్ బోజన్నపేటకు చేరుకొని విద్యార్థులను స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయూలైన 5 గురు విద్యార్థులను కరీంనగర్‌కు తరలించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి కేవలం 10 అడుగుల దూరంలోనే 11 కేవీ కరెంటు స్తంభం ఉండటంతో ఒకవేళ బస్సు స్తంభానికి ఢీకొని ఉండుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు