అవకతవకలు.. అక్రమాలు
పరకాల సివిల్ ఆస్పత్రిలో విజిలెన్ అధికారుల విచారణ
నియామకాలు, కొనుగోళ్లపై ఆరా
పరకాల : పరకాలలోని సివిల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్యులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం సందర్భంగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై కొంతకాలం క్రితం స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఆరు గంటల పాటు..
అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ విజిలెన్‌స అధికారులు మంగళవారం ఉదయం 10 గంటలకు పరకాల ఆస్పత్రికి చేరుకున్నారు. విజిలెన్‌స అధికారులు డాక్టర్ రాజశేఖర్‌బాబు, పరశురాములు విచారణ కోసం రాగా, ఆస్పత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ సంజీవయ్యను ఆరు గంటల పాటు విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరెవరో ఆరా తీశారు. తాము నిబంధనల మేరకే నియామకమైనట్లు లేఖ ఇవ్వాలని ఇద్దరు వైద్యులకు సూచించారు. అలాగే, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల పేర్లపై ఎవరైనా బినామీలుగా పనిచేస్తున్నా రా అని ఆరా తీశారు. ఆ తర్వాత పరికరాల కొనుగోలుకు సంబంధించి బిల్లులు, టెండర్ల ప్రక్రియ రఖాస్తులను పరిశీలించారు. కాగా, తమకు సక్రమంగా పీఎఫ్, ఈఎస్‌ఐలు కట్టడం లేదని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఫిర్యాదు చేయగా ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. అలాగే, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.
రెండు, మూడు రోజుల్లో నివేదిక
పరకాల ఆస్పత్రిలో చేపట్టిన విచారణ నివేదికను రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని విజిలెన్‌స అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాలు, పరికరాల కొనుగోళ్లపై తాము విచారించామని తెలిపారు.