రిమాండ్‌ ఖైదీ మృతి | The death of remand prisoner | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ మృతి

Published Sat, Aug 5 2017 2:03 AM | Last Updated on Mon, Sep 11 2017 11:16 PM

The death of remand prisoner

పోలీసుల దెబ్బలతో ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి విషమించడంతో మృతి
 
కరీంనగర్‌ క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల దెబ్బలు తాళలేక ఓ రిమాండ్‌ ఖైదీ శుక్రవారం మృతిచెందాడు. గత నెలలో ఓ చోరీ కేసులో వేములవాడలోని సాయినగర్‌కు చెందిన వెంకటేశ్‌(25)ను ఎల్లారెడ్డిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత పీటీ వారంట్‌లో మరో చోరీ కేసులో రిమాండ్‌ చూపారు. గతనెల 13న కరీంనగర్‌లోని జిల్లా జైలుకు పంపించారు. రిమాండ్‌ రిపోర్టులో వెంకటేశ్‌కు గాయాలున్నట్లు పేర్కొన్నారు. జైలుకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో జైలు సిబ్బంది గత నెల 15న కరీంనగర్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అదేనెల 21న మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలుగు రోజులు జిల్లా జైలులో చికిత్స అందించినా దెబ్బలు తగ్గలేదు. దీంతో గతనెల 26న సివిల్‌ ఆస్పత్రికి పంపించగా మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో ఇన్‌పేషెంట్‌గా చేర్చారు. గురువారం వెంకటేశ్‌ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి పంపించాలని జైలు సిబ్బందికి ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగానే శుక్రవారం తెల్లవారుజామున వెంకటేశ్‌ మృతిచెందాడు. వెంకటేశ్‌ రిమాండ్‌ ఖైదీ కావడంతో నిబంధనల ప్రకారం జిల్లా జడ్జి, ఆర్డీవో, తహసీల్దార్‌ ఆస్పత్రికి చేరుకుని జ్యుడీషియల్‌ విచారణ ప్రారంభించారు. అయితే తన భర్తను పోలీసులే కొట్టి పొట్టన బెట్టుకున్నారని వెంకటేశ్‌ భార్య రేణుక ఆరోపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement