కరీంనగర్ క్రైం: కరీంనగర్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంబు కొమురయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కొమురయ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆదివారం మరింత క్షీణించడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అతను చనిపోయాడని ధ్రువీకరించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ పి.అశోక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిని డీసీపీ చంద్రమోహన్ (పరిపాలన), టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్ తదితరులు సందర్శించారు. కాగా, న్యాయమూర్తి సాయి సుధ ఆస్పత్రి, జైలు లో వాంగ్మూలం తీసుకున్నారు.
ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు?
ఇప్పలపల్లె గ్రామానికి చెందిన కొమురయ్య ప్రాణానికి పోలీసు అధికారులు రూ.3 లక్షలు ఖరీదు కట్టారు. కరీంనగర్ జిల్లా జైలులో ఆదివారం రాత్రి మృతి చెందగా, ఆస్పత్రికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు కొమురయ్య మృతదేహంపై గాయలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఆందోళనకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కుటుంబీకుల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాగా, చర్చల సమయంలో పరిహారం అడిగినందుకు ఎల్‌ఎండీ ఎస్సై తమను బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment