నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి
చెరువులోపడి ఒకరి మృతి
పంథినిలో ఘటన
గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని పంథినిలో సోమవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... పంథినికి చెందిన పొన్నం కొమురయ్య(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న కొమురయ్య నిమజ్జనంలో భాగంగా ఊర చెరువు వద్దకు చేరుకున్నాడు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి యువకులతోపాటు అతడు నీళ్లలోకి దిగాడు. అరుుతే అతడికి ఈత రాకపోవడంతో నీటమునిగాడు. నిమజ్జన సంబురాల్లో ఉన్న యువకులు ఈ ఘటనను గమనించకుండా బయటకు వచ్చారు. తమ కంటే ముందుగానే కొమురయ్య ఇంటికి వెళ్లాడని భావించిన యువకులు గ్రామానికి వెళ్లిపోయూరు. మంగళవారం ఉదయం వరకు కొమురయ్య ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువకులను విచారించారు.
ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన ప్రదేశంలో గాలించగా విగ్రహం కింద కొమురయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య ఐలమ్మ, కుమార్తెలు సరిత, శారద, కుమారుడు రాజు ఉన్నారు. ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.