'మనవడి' పై తాత హత్యాయత్నం! | - | Sakshi
Sakshi News home page

'మనవడి' పై తాత హత్యాయత్నం!

Published Sun, Mar 31 2024 12:25 AM | Last Updated on Sun, Mar 31 2024 9:38 AM

- - Sakshi

మహేష్‌

నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి

ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం

కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన సామంతుల మహేశ్‌ (28)పై తాత సామంతుల కొమురయ్య హత్యాయత్నం చేశాడు. ఎస్సై సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురయ్యకు కుమారుడు మల్లేశం, కూతురు కనుకవ్వ సంతానం. మల్లేశంకు వివాహమై ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత దాదాపు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతడి కుమారులిద్దరు అశోక్‌, మహేశ్‌ను కొమురయ్య పెంచి పెద్దచేశాడు.

ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వారికి తన వ్యవసాయ భూమిని పంపకం చేశాడు. కాగా మహేశ్‌ తరచూ తాగి వచ్చి తాతతో గొడవపడేవాడు. తన అన్న అశోక్‌కు ఎనిమిది గుంటల భూమి ఎక్కువ ఇచ్చావని దూషిస్తూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మహేశ్‌తో ఎప్పటికైనా తనకు ఇబ్బందులు తప్పవని కొమురయ్య భావించాడు. ఇంటి ముందు పడుకున్న మహేశ్‌పై శనివారం వేకువజామున గొడ్డలితో దాడి చేశాడు.

ఇంట్లో నిద్రిస్తున్న అతడి తల్లి, భార్యకు మెలకువ వచ్చి బయటకు రావడంతో కొమురయ్య గొడ్డలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మహేశ్‌ మేనమామ కట్ట కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మహేశ్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.

ఇవి చదవండి: ఉసురు తీసిన నకిలీ జ్యోతిష్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement