Remand prisoner died
-
జైలులో రిమాండ్ ఖైదీ మృతి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంబు కొమురయ్య (45)ను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కొమురయ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆదివారం మరింత క్షీణించడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అతను చనిపోయాడని ధ్రువీకరించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టౌన్ ఏసీపీ పి.అశోక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిని డీసీపీ చంద్రమోహన్ (పరిపాలన), టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్ తదితరులు సందర్శించారు. కాగా, న్యాయమూర్తి సాయి సుధ ఆస్పత్రి, జైలు లో వాంగ్మూలం తీసుకున్నారు. ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు? ఇప్పలపల్లె గ్రామానికి చెందిన కొమురయ్య ప్రాణానికి పోలీసు అధికారులు రూ.3 లక్షలు ఖరీదు కట్టారు. కరీంనగర్ జిల్లా జైలులో ఆదివారం రాత్రి మృతి చెందగా, ఆస్పత్రికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు కొమురయ్య మృతదేహంపై గాయలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఆందోళనకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కుటుంబీకుల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. కాగా, చర్చల సమయంలో పరిహారం అడిగినందుకు ఎల్ఎండీ ఎస్సై తమను బెదిరించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. -
పోలీసులు కొట్టిన దెబ్బలకే రిమాండ్ ఖైదీ మృతి
గుంటూరు ఈస్ట్: రిమాండ్ ఖైదీ మృతికి కారణమయిన పోలీసులపై చర్యలు తీసుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జీజీహెచ్ మార్చురి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. దీంతో మృతుడి పోస్టుమార్టం గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరాములు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీమకుర్తి సిద్ధార్థనగర్‌లో నివసించే ఎనిమిది మంది ఎస్సీ,ఎస్టీలను దారి దోపిడీ అనుమానంపై పోలీసులు మార్చి 30వ తేదీ అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణ సమయంలో వారిని తీవ్రంగా కొట్టడంతో రిమాండుకు తరలించిన అనంతరం మన్నెం చిన గంగయ్య (20) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీ జీజీహెచ్‌కు తరలించారన్నారు. చికిత్స పొందుతూ చిన గంగయ్య అదే రోజు రాత్రి మృతి చెందాడని వివరించారు. దీనిపై సిట్టింగ్ జడ్జి, వైద్యుల బృందం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా విచారణ జరిపి చిన గంగయ్య మృతికి కారణమయిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. రిమాండులో ఉన్న మిగిలిన వారందిరికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించి చికిత్స జరిపించాలని కోరారు. చిన గంగయ్య సోదరుడు అంకమ్మరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అతనికి ప్రత్యేక వైద్యం చేయించి ప్రాణాలు పోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. నిరసనలో సమాఖ్య నాయకులు మేకల ఏడుకొండలు, అద్దంకి అంకారావు, కె.ఏడుకొండలు , ఖాజారావు, ఖాజావలీ, జి.శ్రీను పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావు మార్చురీ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో చిన గంగయ్య మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
అసలేం జరిగింది?
శ్రీకాకుళం సిటీ: రిమాండ్ ఖైదీ మాదిన వల్లభరావు మృతిపై విచారణ కొనసాగుతోంది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే! ఈ కేసుకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు రావడంతో ఆర్డీవో స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు. రిమ్స్‌లో ఆర్డీవో బలివాడ దయానిది, తహసీల్దార్ సుధాసాగర్ల నేతృత్వంలో శనివారం మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల నుంచి సమగ్ర వివరాలను సేకరించారు. తొలుత ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్డీవో బలివాడ దయానిధి, శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు ఉదయమే రిమ్స్‌కు విచారణకు హాజరయ్యారు. మృతుని బంధువులు పూర్తిస్థాయిలో మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. శనివారం రాత్రి వరకు విచారణ కొనసాగింది. ముందుగా మృతుడి కుటుంబ సభ్యులు రిమ్స్ వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాశీబుగ్గ సీఐ ఎస్ తాతారావు, స్థానిక సీఐ తిరుపతి, పాతపట్నం సబ్‌జైల్ సూపరెండెంటెంట్ శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ ఉన్నారు. -
రిమాండ్ ఖైదీ మృతి
పోలీసుల దెబ్బలతో ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి విషమించడంతో మృతి కరీంనగర్ క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల దెబ్బలు తాళలేక ఓ రిమాండ్ ఖైదీ శుక్రవారం మృతిచెందాడు. గత నెలలో ఓ చోరీ కేసులో వేములవాడలోని సాయినగర్‌కు చెందిన వెంకటేశ్(25)ను ఎల్లారెడ్డిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత పీటీ వారంట్లో మరో చోరీ కేసులో రిమాండ్ చూపారు. గతనెల 13న కరీంనగర్‌లోని జిల్లా జైలుకు పంపించారు. రిమాండ్ రిపోర్టులో వెంకటేశ్‌కు గాయాలున్నట్లు పేర్కొన్నారు. జైలుకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో జైలు సిబ్బంది గత నెల 15న కరీంనగర్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అదేనెల 21న మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలుగు రోజులు జిల్లా జైలులో చికిత్స అందించినా దెబ్బలు తగ్గలేదు. దీంతో గతనెల 26న సివిల్ ఆస్పత్రికి పంపించగా మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో ఇన్‌పేషెంట్‌గా చేర్చారు. గురువారం వెంకటేశ్ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించాలని జైలు సిబ్బందికి ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తుండగానే శుక్రవారం తెల్లవారుజామున వెంకటేశ్ మృతిచెందాడు. వెంకటేశ్ రిమాండ్ ఖైదీ కావడంతో నిబంధనల ప్రకారం జిల్లా జడ్జి, ఆర్డీవో, తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని జ్యుడీషియల్ విచారణ ప్రారంభించారు. అయితే తన భర్తను పోలీసులే కొట్టి పొట్టన బెట్టుకున్నారని వెంకటేశ్ భార్య రేణుక ఆరోపిస్తోంది.