అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో మత ఆధారిత వివక్ష వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మతం ఆధారంగా రోగులను విడివిడిగా ఉంచుతున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ఇదంతా గుజరాత్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరుగుతోందని అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా బాధితులు, అనుమానితులైన హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేసినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుణవంత్ హెచ్ రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగానే వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ‘మామూలుగా ఆస్పత్రుల్లో మహిళలు, పురుష రోగులకు వేర్వేరుగా వార్డులు ఉంటాయి. కానీ ఇక్కడ.. హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేశామ’ని డాక్టర్ రాథోడ్ చెప్పారు. ఇలా ఎందుకు విభజించారని ప్రశ్నించగా.. ‘ఇది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వాన్నే అడగండి’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్ ఆస్పత్రిలో 150 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా వీరిలో 40 మంది వరకు ముస్లింలు ఉన్నట్టు సమాచారం.
మతం ఆధారంగా వార్డులను విభజించడం గురించి తనకు తెలియదని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ చెప్పడం విశేషం. అటు అహ్మదాబాద్ కలెక్టర్ కేకే నిరాళ కూడా ఇదే మాట చెప్పారు. ‘మా నుంచి అటువంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విషయం మాకు తెలియద’ని అన్నారు. (మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ?)
మార్చి చివరి వారంలో అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొత్త బ్లాక్‌ను అహ్మదాబాద్-గాంధీనగర్ జోన్ కోవిడ్-19 రోగుల కోసం ప్రత్యేకించారు. కాగా, మతం ఆధారంగా వార్డుల విభజన వాస్తవమేనని ఆస్పత్రిలోని రోగులు వెల్లడించారు. ‘ఆదివారం రాత్రి ఏ-4 బ్లాక్‌లోని 28 మందిని వారి పేర్లు ఆధారంగా బయటకు పిలిచారు. తర్వాత వారిని మరోవార్డు(సీ-4)కు తరలించారు. మమ్మల్ని ఎందుకు తరలిస్తున్నారో చెప్పలేదు. ఈ 28 మంది ఒకే మతానికి చెందిన వారు. దీని గురించి మా వార్డులోని ఆస్పత్రి ఉద్యోగిని అడగ్గా 'రెండు వర్గాల సౌలభ్యం' కోసం ఇది జరిగిందని తెలిపాడ’ని రోగి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment