పురిట్లోనే శిశువు మృతి
-
డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయిందని బంధువుల ఆరోపణ
-
మృతశిశువుతో ఆస్పత్రి ఎదుట ధర్నా
-
తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయిందంటున్న వైద్యులు
పరకాల : అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగిన బిడ్డ.. గర్భం నుంచి బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే ప్రాణాలు విడిచింది. కనులు తెరవక ముందే కన్నుమూసింది. డ్యూటీ డాక్టర్ సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హన్మకొండ రాము–లావణ్య(సవిత)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాము పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో హమాలీ పనిచేస్తుండగా లావణ్య కూలీ పని చేస్తోంది.
వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం లావణ్య మూడోసారి గర్భం దాల్చింది. హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నరీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఏఎన్‌ఎం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో మంచి సదుపాయాలున్నాయని చెప్పి నిండు గర్భిణి అయిన లావణ్యను ఇక్కడికి తీసుకొచ్చింది. శుక్రవారం లావణ్యతోపాటు భర్త రాము కూడా వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు లావణ్యను ఇంటికి తీసుకెళ్లండని, నొప్పులు వస్తే తీసుకురావాలని చెప్పారు. దీంతో కామారెడ్డిపల్లికి లావణ్యను తీసుకెళ్లారు. శనివారం ఉదయం నొప్పులు రావడంతో రాము ఆమెను సివిల్ ఆస్పత్రికి తరలించాడు. అయితే డాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం రాము డ్యూటీ డాక్టర్‌కు తన భార్య విషయం చెప్పాడు. దీంతో డ్యూటీ డాక్టర్ పద్మజ వచ్చి లావణ్యను డెలివరీ కోసం గదిలోకి తీసుకెళ్లారు. సాధారణ డెలివరీతో లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు బాగానే ఉన్న శిశువుకు ఆక్సిజన్ అందించడంలో డాక్టర్లు పట్టించుకోలేదు. శిశువును ప్రైవేటు ఆస్పత్రిలో చూపించడం కోసం తీసుకుపోతుండగా మృతిచెందింది.
మృతశిశువుతో ధర్నా..
ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే శిశువు చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతశిశువును చేతుల్లో పట్టుకొని ఆస్పత్రిలోకి వెళ్లకుండా బైఠాయించారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. ఎస్సై దీపక్ అక్కడకు చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
మృతశిశివునే బయటకు తీశాం : డ్యూటీ డాక్టర్ పద్మజ
ఆస్పత్రిలో చేరిన లావణ్యను పరిశీలిస్తూనే ఉన్నాం. చనిపోయిన శిశువు పూర్తిగా బయటకు వచ్చింది. అందులో మా తప్పు లేదు. డెలివరీ చేయకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం జరిగేది.
విచారణ చేస్తున్నాం: డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఇన్‌చార్జీ సూపరింటెండెంట్
ఆస్పత్రిలో చనిపోయిన శిశువు ఘటనపై విచారణ చేస్తున్నాం. డ్యూటీ డాక్టర్ పద్మజ, ఏఎన్‌ఎంలు స్వరూప, వాణి ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నిర్లక్ష్యం ఉన్నట్లు తెలితే చర్యలు తీసుకుంటాం.