ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.. వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు. శక్తి యుక్తులు కలిగిన నారీమణి. అతని వెంట ఆమె కాదు.. అన్నింటా ఆమే. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.. అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భిన్న కథనాల సమాహారమే ఈ రోజు సండే స్పెషల్..
అమ్మ ఆనందం
ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లను మహిళలకు అంకితం ఇచ్చారు. ఇతరుల్లో స్ఫూర్తిని నింపే కథనాలు ఆయన అకౌంట్ ద్వారా # SheInspiresUsహ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వాటిల్లో గుర్‌గావ్ మామ్స్ కమ్యూనిటీ కథ వైరల్‌గా మారింది. ఇంటెడు చాకిరీచేసే అమ్మకి కూడా రిలాక్సేషన్ కావాలి. అమ్మ ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలాంటి అమ్మలందరినీ ఒకచోటకి చేర్చి వారినీ సంతోషంగా ఉంచడా నికి నీల కౌశిక్ గుర్‌గావ్ మామ్స్ సంస్థని స్థాపించారు. చెన్నైకి చెందిన ఆమె కొన్నాళ్లు భర్తతో కలసి అమెరికాలో ఉన్నా రు. తర్వాత సొంతూరు గుర్‌గావ్‌కి వచ్చేశారు. డిజి టల్ మాధ్యమాన్ని వినియోగిస్తూ 2012లో అమ్మ లందరినీ ఒకచోటకి చేర్చే పని ప్రారంభించారు. 30 వేల మందికిపైగా అమ్మలు సభ్యులయ్యారు. రాత్రిపూట ఔటింగ్‌కు తీసుకెళ్లడం, వాళ్లలో అంతర్లీనంగా ఉన్న కళల్ని వెలికితీయడం, వాళ్లు తయారుచేసే వస్తువులకి బ్రాండింగ్ కల్పిం చి సోషల్ మీడియా ద్వారా విక్రయించడం వంటివి కౌశిక్ నేతృత్వంలో జరుగుతోంది. వీళ్లం తా ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తుంటారు. అనుభూతుల్ని కలబోసుకుంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. అందుకే మహిళలకంటూ ఒకరోజు ఎందుకో తనకు అర్థంకాదని అంటారు కౌశిక్. నిజమే కదా.. ప్రతీరోజూ మహిళలదే అయినప్పుడు వారికంటూ ప్రత్యేకంగా రోజెందుకు? హ్యాపీ ఉమెన్స్ డే.. నిన్న, ఇవాళ, రేపు.. రోజూ..
ఒక్కరోజు కలెక్టరమ్మ
ఉద్యోగం కావాలంటే అనుభవం ఉందా అని అడుగుతారు. ఎవరైనా అవకాశం ఇస్తే కదా అనుభవం వచ్చేది.. ప్రతిభ బయటకొచ్చేది..! ఈసారి మహిళాదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర బుల్ధానా జిల్లా యంత్రాంగం అమ్మా యిలకి అలాంటి అవకాశం వచ్చేలా వినూత్న ఆలోచన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరికల్లాంటి అమ్మాయిలను ఎంపికచేసి వారికి ఒక్కరోజు కలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తారు. జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు, జిల్లా అభివృద్ధికి రచించాల్సిన ప్రణాళికలు వంటివి ఒక్కరోజు ఆ కలెక్టర్ పదవిలో ఉండే అమ్మాయి ప్రభుత్వానికి వివరించే మహత్తర అవకాశం వస్తుంది. ఇదంతా చదవుతుంటే ఒక్కరోజు సీఎం పదవిపై వచ్చిన సినిమా గుర్తుకు వస్తోం దా? అది సినిమా కాబట్టి ఓకే. కానీ రియల్‌లైఫ్‌లో అది సాధ్యమేనా అనుకోవద్దు. మహిళలు తలచు కుంటే ఏదైనా సాధ్యమే. ఆ 24 గంటల సమయంలోనే ఎన్నో చేయొచ్చు. సమాజాన్ని మార్చే వినూత్న ఆలోచన మెదడులో పుట్టడానికి క్షణం చాలు. దానిని అమలుచేసే అవకాశం రావడమే అరుదు. అలాంటి అరుదైన అవకాశం బుల్ధానా అమ్మాయిల్లో ఒకరికి వస్తోంది. ఇలా ఒక్కరోజు ఆ కుర్చీలో కూర్చుంటే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, ఇంకా బాగా పని చేయాలన్న ప్రేరణ కూడా వస్తుంది. ప్రభు త్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో సామాజిక, ఇతర అంశాలను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్‌గా తెలిస్తే, ఐఏఎస్ కావాలన్న స్ఫూర్తి కూడా వారిలో రగులుతుందని బుల్ధానా కలెక్టర్ సుమన్‌చంద్ర అభిప్రాయపడ్డారు.
ఊదా..సమానత్వ హోదా
అమ్మాయిలంటే పింక్, అబ్బాయిలంటే బ్లూ.. కానీ ఈసారి మహిళా దినోత్సవంలో ఒక కొత్త రంగు కనిపిస్తోంది. అదే పర్పుల్. ఈ మధ్య ఏ పార్టీలు జరిగినా వేసుకునే డ్రెస్సుల్లో కలర్ కోడ్ పాటిస్తున్నారు. ఈసారి ఐక్యరాజ్య సమితి.. మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ పర్పుల్ రంగు దుస్తులు ధరించాలని పిలుపునిచ్చింది. ఈ రంగు ఎంచుకోవడానికీ ఓ కారణముంది. ఆడ, మగా ఇద్దరూ సమానమేనని మాటల్లోనే చెబుతాం. ఆచరణలోకి ఇంకా అది రావడం లేదు. 2020లోకి వచ్చినా ఈ భావన ఇంకా పోలేదు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా లింగ సమానత్వాన్ని సాధించలేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబు తోంది. ఇంటి పనుల్ని చక్కబెట్టడంలో, పనిచేసే ప్రదేశాల్లో, ఒకే పనికి వచ్చే వేతనాల్లో, చదువులో, ఆరోగ్యంలో ఇలా అన్నింటా ఇంకా ఆమె చేరుకోవాల్సిన లక్ష్యాలు భారీగానే ఉన్నాయి. అందుకే మహి ళలు తమ హక్కుల్ని తెలుసుకొని అన్నింటా సమానత్వాన్ని సాధించే లక్ష్యంతో ఉమెన్స్ డే కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. ఈ సమానత్వం అనే భావనకు ఊదా రంగు ప్రతీకగా నిలుస్తుంది. మన రంగులకీ ఒక శాస్త్రం ఉంది. నిజాయితీ, లక్ష్యసాధనలో స్థిరత్వం, ఒక ప్రయోజనం నెరవేర్చుకోవడంలో దృఢనిశ్చయం వంటి వాటికి పర్పుల్ రంగు సంకేతం. మహిళా స్వేచ్ఛా ఉద్యమం థీమ్ కలర్ ఊదాయే. మరెందుకాలస్యం.. పర్పుల్ రంగు దుస్తులు వేసుకోండి. మీరనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చుకోండి.
సూపర్ ‘షీ’రోస్
సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్.. ఇలా ఏది చూసినా మగవారిని హీరోలుగా చేసి చూపించే పాత్రలే. కానీ మహిళలకేం తక్కువ? వారి శక్తి సామర్థ్యాలు మగవాళ్లకి ఏ విధంగానూ తీసిపోవని శాస్త్రీయంగా రుజువైంది. ∙దీర్ఘాయుష్మాన్‌భవ అని పెద్దవాళ్లు దీవిస్తారు కదా! ఆ దీవెనలన్నీ ఆడవారికే దక్కినట్టుగా అనిపిస్తోంది. 110 ఏళ్ల కంటే ఎక్కువ జీవితాన్ని చూసిన 43 మందిలో 42 మంది మహిళలే ఉన్నారని గ్లోబల్ గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. శరీర నిర్మాణం, సామాజికపరమైన అంశాలు, వ్యసనాలు లేకపోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆడవారిలో ఆయుష్షును పెంచుతున్నాయి.మగవారితో పోలిస్తే ఆడవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువట. కరువు కాటకాలు, వాతావరణ మార్పులు, వ్యాధులు ప్రబలినప్పుడు మహిళలే ఎక్కువగా తట్టుకోగలరని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ అధ్యయనకారులు చెబుతున్నారు. దీనికి స్పష్టమైన కారణాలు సరిగ్గా వెల్లడి కానప్పటికీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా స్వీకరించుకోగలిగే శక్తి వారికి వస్తుందని చెబుతున్నారు.∙మానసికంగా మహిళలే ఎక్కువగా బలవంతులని సెయింట్ గాలెన్ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. మగవారి కంటే మహిళలే అత్యధికంగా ఒత్తిళ్లను తట్టుకోగలరట. l మగవారి మెదడు సైజు పెద్దదేమో కానీ, సొంత తెలివి మాత్రం ఆడవాళ్లదేనట. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నిర్వహించిన ఐక్యూ పరీక్షల్లో మహిళలు స్పందించినంత చురుగ్గా మగవారు స్పందించలేరని తేలింది.
ప్రెగ్నెంట్ మోడల్స్
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఏం జరిగినా ఫొటోలు దిగడం, వాటిని షేర్ చేయడం సర్వసాధారణమైంది. ఒకప్పుడు గర్భిణులు బయటకి రావడానికి కూడా కాస్త బిడియపడేవారు. అందులోనూ సెలబ్రిటీలైతే కెమెరాలకు దూరంగా ఉండేవారు. గర్భం దాల్చినప్పుడు పెరిగే పొట్ట, భారీ శరీరంతో గ్లామరస్‌గా కనిపించమేమోనన్న సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. గర్భం దాల్చినప్పుడు మహిళల్లో కనిపించే ఆ నిండుదనంలో ఒక అందం కూడా ఉంటుందని గ్రహించిన బాలీవుడ్ భామలు ప్రెగ్నెన్సీ వస్తే ఫొటో షూట్‌లు చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దానినే స్ఫూర్తిగా తీసుకొని ఆయూష్ కేజ్రీవాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ గర్భం దాలిస్తే ఆడవారిని మోడలింగ్‌కు దూరంగా ఉంచి ఎందుకు వివక్ష చూపించాలని భావించారు. వెంటనే ఓ గర్భిణితో కలంకారి చీరలకు మోడలింగ్ చేయించి, ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు. ఇలా ప్రెగ్నెంట్స్‌గా ఉన్నప్పటికీ మోడలింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్ అనే చెప్పాలి. గర్భిణులు వారికి ఇష్టమైతే పని చేస్తారు. లేదంటే బ్రేక్ తీసుకుంటారు. అది వారి స్వేచ్ఛ. కానీ మోడల్స్ అలా కాదు. వాళ్లకి ప్రెగ్నెన్సీ వస్తే తప్పనిసరిగా పనికి దూరం కావాలి. అలా పనిచేసే పరిస్థితి లేకపోవడం అంటే వారి స్వేచ్ఛను హరించడమే. అలాకాకుండా అమ్మతనాన్ని కూడా నిండుగా చూపించడమనే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది. మున్ముందు ఇది మరింతగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆతిథ్యంలో ఆమెది అందెవేసిన చెయ్యి
అతిథి మర్యాదల్లో మన మహిళామణులది అందెవేసిన చెయ్యి. ఇంటికి ఎవరైనా అతిథులొస్తే వారికి చిన్నపాటి కష్టం కలగకుండా సర్వం అమర్చిపెట్టే సహనం ఉన్న వారు. ఆ ఆతిథ్యమే ఇప్పుడు వారికి ఆర్థిక స్వావలంబనకి బాటలు వేసింది. ఎయిర్ బీఎన్‌బీ అంటే తెలుసా? ఆతిథ్య రంగంలో పేరొందిన అంతర్జాతీయ ఆన్‌లైన్ ప్లాట్ ఫాం. ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడికి వెళ్లి ఉండాలన్నా.. ఫుల్ ఫర్నిచర్‌తో ఉన్న ఇళ్లు, సకల సౌకర్యాలతో బస కల్పించే ప్లాట్‌ఫాం ఇది. ఊళ్లు పట్టుకొని తిరిగే వారికి దీని ద్వారా బస ఏర్పాటు చేసుకోవడం సులభం. మహిళలు ఆతిథ్యమిచ్చే ఎయిర్‌బీఎన్‌బీ ద్వారా గతేడాది భారత్‌లో మహిళలు రూ.100 కోట్లకు పైగా సంపాదించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌లలో ఎయిర్ బీఎన్‌బీ వినియోగదారులు ఎక్కువ. భారతీయ మహిళల్లో 34 శాతం మంది దీని ద్వారా ఆతిథ్యమిస్తే, 40 శాతం మంది అతిథులుగా వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఎయిర్ బీఎన్‌బీ ద్వారా ఆతిథ్యమిచ్చి ప్రపంచవ్యాప్తంగా మహిళలు 14,900 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇలా మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ రావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా కంట్రీ మేనేజర్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ అంటున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని #hostwithher హ్యాష్‌ట్యాగ్‌తో మహిళల్లో పారిశ్రామిక స్ఫూర్తిని నింపే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. డిజిటల్ టూరిజం కీలకంగా మారిన ఈ రోజుల్లో మహిళల సంపాదన శక్తి ఎలా పెరుగుతోందో ఎయిర్ బీఎన్‌బీ రుజువు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment