
ఐపీఎస్ అధికారి తండ్రి అనుమానాస్పద మృతి
ఉత్తర ప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ త్యాగి తండ్రి అనుమానాస్పద మృతి చెందారు.
గజియాబాద్: ఉత్తర ప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ త్యాగి తండ్రి ఈశ్వర్ త్యాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ఉదయం గజియాబాద్‌లోని నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈశ్వర్ త్యాగి మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా కుటుంబ కలహాల కారణంగా ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టానికి తరలించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీనియర్ పోలీసులు అధికారులు.... ఈశ్వర్ త్యాగి తలలో ఓ బుల్లెట్ ఉందని తెలిపారు. మానసిక పరిస్థితి బాగా లేని ఆయనకు... చిన్న కుమారుడితో కలహాలు ఉన్నాయని, దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే కేసును చేధిస్తామని నగర సర్కిల్ ఆఫీసర్ మిశ్రా తెలిపారు.