సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ప్లాట్‌ఫారాలపై నోరూరించే ఆహార విక్రయ కేంద్రాలు (ఫుడ్ కోర్టులు) ఏర్పాటు కానున్నాయి. వాస్తవానికి ఐఆర్‌సీటీసీ కేవలం రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఆహారాన్ని అందజేస్తుంది. ప్లాట్‌ఫారాలపై చిన్న కాంట్రాక్టు వెండర్లు ఆహారాన్ని విక్రయిస్తున్నారు. అయితే వీళ్లు విక్రయించే ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై ఐఆర్‌సీటీసీ ఆహారాన్ని విక్రయించుకోవచ్చని భారతీయ రైల్వే సెప్టెంబర్‌లో అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రైల్వే కేంద్రాల్లో ఫుడ్ కోర్టులకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే త్వరలో సికింద్రాబాద్‌లోనూ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయనుంది.
త్వరలో కాజీపేట,తిరుపతి, విజయవాడ!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ తర్వాత విజయవాడ, తిరుపతి, కాజీపేట స్టేషన్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ స్టేషన్లలోనూ త్వరలోనే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఐఆర్‌సీటీసీ ఉన్నట్లు తెలిసింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌లో అమలు చేశాక.. త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కీలకమైన స్టేషన్లలోనూ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
‘ఈట్ @ సికింద్రాబాద్’
సికింద్రాబాద్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫారంపై హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (హెచ్‌ఎంఎస్ ) విదేశీ సంస్థ భాగస్వామ్యంతో ఈ ఫుడ్ కోర్టు ఏర్పాటు కానుంది. ‘ఈట్ ఎట్ సికింద్రాబాద్’ పేరిట 250 గజాల స్థలంలో 2 గదులతో ఈ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 1,80,000 మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేష్టన్‌లో ఈ ఫుడ్ కోర్టు ఏర్పాటుతో అన్ రిజర్వుడ్, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ఫుడ్ కోర్టు కొన్ని పనులు మినహా నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అవి కూడా పూర్తి చేసి దసరాకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment