అఖిలేష్‌తో రాహుల్‌కు పొత్తు కుదిరేనా!
న్యూఢిల్లీ: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్‌వాది పార్టీ పొత్తు కుదుర్చుకున్నట్లయితే 403 సీట్లకుగాను 300 సీట్లను కూటమి గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన మాటలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే పొత్తు కుదరాలంటే మాత్రం గౌరవ ప్రదమైన సీట్ల సంఖ్యను కేటాయించాలని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కేవలం 56 సీట్లను కేటాయించేందుకు సమాజ్‌వాది పార్టీ సుముఖంగా ఉందని, కనీసం 100 సీట్లను కేటాయిస్తేగానీ ఇరు పార్టీల మధ్య పొత్తుకుదరదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 56 సీట్లనే ఆఫర్ చేయడానికి కారణాలు ఉన్నాయని సమాజ్‌వాది పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొందని, మరో 26 సీట్లలో సమాజ్‌వాది పార్టీకన్నా ముందున్నదని, ఓ రెండు సీట్లలో నాడు సమాజ్‌వాది పార్టీ పోటీ చేయలేదని, ఈ సీట్లను కలిపితే 56 సీట్లు అవుతాయని, వీటిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం సమంజసమని ఎస్పీ వర్గాలు వాదిస్తున్నాయి. అంతేకాకుండా గత ఎన్నికల్లో 240 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎస్పీ వర్గాలు అంటున్నాయి.
ఎస్పీలో బాబాయ్ (శివపాల్ యాదవ్), అబ్బాయ్ (అఖిలేష్ యాదవ్) గొడవల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్రంలో పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు కనీసం రెండు సార్లు ఎస్పీతో పొత్తుపెట్టుకునేందుకు పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. రెండు సార్లు కూడా ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రతిపాదనను తిరస్కరించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నందున బీజేపీకి, బీఎస్పీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎస్పీలు కూటమిగా ఏర్పడితే కలిసివస్తుందని సమాజ్‌వాది పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో 19 శాతం ఉన్న ముస్లింలను ఆకర్షించేందుకు బీఎస్పీ నాయకురాలు మాయావతి కషి చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే వారు కూడా తమకు మద్దతిస్తారని అనుకుంటోంది. మరోపక్క ఎలాగైనా యూపీలో ఎస్పీతో పొత్తుపెట్టుకోవాల్సిందిగా ఇటీవల దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీని కలసుకొని కోరారు.