
‘ఏం జరుగుతుందసలు? ఇదేమన్న స్కూలా?’
న్యూఢిల్లీ: ఎప్పుడు శాంతంగా కనిపించే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు చిరాకొచ్చింది. సభలో సభ్యుల తీరుపట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇదేమన్న స్కూల్(పాఠశాల) అనుకుంటున్నారా అని కాస్తంత గట్టి స్వరంతో ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ్యులు అరుపులు, గోలతో రచ్చరచ్చగా మారింది.
దాంతో సభలో ప్రశాంత వాతావరణంకోసం పలుమార్లు సభ్యులను బ్రతిమిలాడి చూసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘అసలు ఏం జరుగుతుంది? అల్లరి చేయడానికి ఇదేమన్న స్కూల్ అనుకుంటున్నారా?’ అని సభ్యులను గట్టిగా ప్రశ్నించారు. వాస్తవానికి సభ ప్రారంభమైన తర్వాత గంటపాటు ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా సాగాయి. ఆ సమయంలో సభలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. ప్రశ్నోత్తరాలు అయిపోగానే మోదీ వెళ్లిపోయారు. ఆ వెంటనే సభలో లొల్లి మొదలైంది. దీంతో సభ నడపడం కష్టంగా మారడంతో ఆమె అలా అన్నారు.